ఖమ్మం సిటీ, మార్చి 22: మంచి జరుగుద్దని ఆశించి, తమ వర్గాలకు ఈ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని భావించి, ఓట్లు వేసి గెలిపించిన కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు పరాభవం మిగిల్చిందని ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాతా మధు అన్నారు. ఖమ్మంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయం (తెలంగాణ భవన్)లో ఆదివారం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం భవిష్యత్‌లో ఏం చేయబోతుందో అనే విషయం అసెంబ్లీలో ఇటీవల ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ చెబుతోందని అన్నారు. చట్టసభల్లో తమకు, బయట ఉన్న సబ్బండ వర్గాల ప్రజలకు నిరాశ మిగిల్చిందని న్నారు. రెండున్నరేళ్ల అధికారంలో ఆత్మస్తుతి, పరనింద తప్ప మరొకటి లేదని విమర్శించారు. కేసీఆర్ కంటే మంచి పరిపాలన అందిస్తారనే భ్రమల్లోకి వెళ్లి ప్రజలందరూ కాంగ్రెస్‌కు ఓట్లేశారని అన్నారు. కానీ కాంగ్రెస్ మాత్రం.. తాను ఇచ్చిన హామీలను విస్మరించి బీఆర్ఎస్పైనా, కేసీఆర్‌పైనా బురద జల్లే ఆలోచన చేస్తోంది తప్ప మరేమీ చేయడం లేదని ఆరోపించారు. అభివృద్ధి చెందిన రాష్ర్టాన్ని అధోగతి పాలుచేయాలని చూస్తోందని ధ్వజమెత్తారు.
రూ.3.75 లక్షల కోట్ల అప్పుతో ఏం చేశారు..
ఒక పక్క కాగ్, బీజేపీ సర్కారు పార్లమెంట్ సాక్షిగా ఒక లెక్క చెబితే.. బూతులరెడ్డి మాత్రం మరో విధంగా మాట్లాడుతున్నారని తాతా మధు ఎద్దేవా చేశారు. కేసీఆర్ అధికారంలో ఎనిమిది లక్షల కోట్లు అప్పు చేశారని, వాటిని తీర్చడానికే మాకు డబ్బులు సరిపోవడం లేదని అబద్దాలు ఆడుతున్నరని మండిపడ్డారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేండ్ల అధికారంలో కేవలం రూ.2.80 లక్షల కోట్ల అప్పు చేసిందని కేంద్రమే చెబుతోందని గుర్తుచేశారు. బీఆర్ఎస్ తెచ్చిన రూ. 2.80 లక్షల కోట్లు అప్పుతో రాష్ట్ర ప్రజల ఆస్తులను, ఆర్థిక స్థోమతను పెంచిందని వివరించారు. దేశంలో తెలంగాణను నంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దిందని గుర్తుచేశారు. కాంగ్రెస్ పార్టీ మాదిరి ఢిల్లీకి తాబేదార్లుగా, సంచులు మోసేది, గులాంగిరీ చేసేది తమ పార్టీ కాదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రెండున్నరేళ్లలో రూ. 3.75 లక్షల కోట్లు అప్పు చేసిందని పార్లమెంట్లో కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి ప్రకటించారని తెలిపారు. మరి ఆ అప్పులతో తెలంగాణ ప్రజలకు ఏం చేశారని ప్రశ్నించారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీలను నిండా ముంచారు..
ఎక్కడైతే కాసుల వర్షం కురుస్తుందో, ఎక్కడైతే పది శాతం నుంచి ముప్పై శాతం వరకు కమీషన్లు వస్తాయో.. తద్వారా వాళ్ల జేబులు నిండుతాయో ఆయా రంగాలకే బడ్జెట్లో నిధులు కేటాయింపులు జరిగాయని తాతా మధు ఆరోపించారు. ఎస్సీ, ఎస్సీ, బీసీ, మైనార్టీలను నిండా ముంచిందని ఆరోపించారు. బడ్జెట్లో బీసీలకు కేటాయించిన పర్సంటేజీ 3.86 శాతం మాత్రనని అన్నారు. వ్యవసాయ రంగం విషయానికి వస్తే.. కేసీఆర్‌కు ఓటేస్తే కేవలం రూ.10 వేల రైతుబంధు వస్తుందని, తాము గెలిస్తే రూ.15 వేలు ఇస్తామని ఎన్నికలకు ముందు రాహుల్‌గాంధీ, రేవంత్‌రెడ్డి ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చారని తాతా మధు గుర్తుచేశారు. మరి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఎన్ని వేలు ఇచ్చారో చెప్పాలని ప్రశ్నించారు.
ఈ బడ్జెట్లో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేసిందని, నిరుద్యోగులకు మొండిచేయి చూపిందని మండిపడ్డారు. 10 శాతం నుంచి 30 శాతం వరకు కమీషన్లు వచ్చే శాఖలకు మాత్రమే బడ్జెట్లో నిధుల కేటాయింపు జరిగిందని తాతా మధు ఆరోపించారు. పర్సంటేజీలు తెచ్చిపెట్టే శాఖలకు అప్రదాయకమైన రంగాల నిధులను డైవర్షన్ చేస్తున్నారని దుయ్యబట్టారు. ఇప్పటికే రిటైర్మెంట్ బెనిఫిట్స్ రాక రిటైర్ ఉద్యోగులు చనిపోతున్నా ప్రభుత్వానికి పట్టడం లేదని విమర్శించారు. మొత్తంగా ఇందిరమ్మ రాజ్యంలో సబ్బండ వర్గాలనూ కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని ధ్వజమెత్తారు. అందుకని రేవంత్ సర్కార్‌పై ఉద్యమించాలని పిలుపునిచ్చారు. సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు, ఉద్యమకారులు పగడాల నాగరాజు, బెల్లం వేణుగోపాల్, ఉన్నం బ్రహ్మయ్య, వేముల వీరేశం, బొమ్మెర రామ్మూర్తి, బిచ్చాల తిరుమలరావు, తాజుద్దీన్, బంకా మల్లయ్య, గుండ్లపల్లి శేషగిరిరావు, బలుసు మురళీకృష్ణ, మొహ్మద్ రఫీ, బురాన్ పాల్గొన్నారు.