కారేపల్లి, మే 02 : కారేపల్లి మండల పరిధిలోని సూర్యతండా, అప్పయగూడెం రైల్వే గేటు పనులు ప్రారంభించి పది రోజులు కావస్తున్నా ఆ పనులు మాత్రం పూర్తి కావడం లేదు. దీంతో వాహనదారులు నానా ఇబ్బందులు పడుతూ రోజులు గడుపుతున్నారు. పనులు ప్రారంభించి పది రోజులు కావస్తున్నా గేటు పనులు మాత్రం నామమాత్రంగా జరుగుతున్నాయని వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాస్తవంగా రెండు, మూడు రోజుల్లో పూర్తి చేయాల్సిన పనులు రైల్వే అధికారుల నిర్లక్ష్యంతో సకాలంలో పూర్తి చేయలేకపోతున్నారు. దీంతో చుట్టుపక్కల ప్రజలు రాకపోకలకు నానా అవస్థలు పడుతున్నారు. ఈ రోడ్డు మార్గం ద్వారా వెళ్లవలసిన ప్రజలు వేరే మార్గం ద్వారా వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అసలే ఎండాకాలం కావడంతో దూర ప్రయాణం చేయడం చాలా ఇబ్బందికరంగా ఉందని వాహనదారులు రైల్వే అధికారులపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇప్పటికైనా స్పందించి తక్షణమే పనులను పూర్తి చేయాలని కోరుతున్నారు.