భద్రాచలం, అక్టోబర్ 14: గిరిజన సంక్షేమ శాఖలో ఏళ్ల తరబడి పనిచేస్తున్న డైలీవైజ్, ఔట్ సోర్సింగ్ కార్మికుల సమస్యలు పరిష్కరించని పక్షంలో మంత్రులు, ఎమ్మెల్యేలను ఎక్కడికక్కడ అడ్డుకుంటామని సీపీఎం జిల్లా కార్యదర్శి మచ్చా వెంకటేశ్వర్లు, సీఐటీయూ జిల్లా కార్యదర్శి బ్రహ్మచారి, యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి విజయ్ హెచ్చరించారు. భద్రాచలంలోని ఐటీడీఏ ఎదుట గిరిజన హాస్టల్ వర్కర్ల జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన 72 గంటల నిరవధిక ధర్నా మంగళవారం రెండో రోజుకు చేరింది.
ఉదయం ఐటీడీఏ ప్రధాన ద్వారం వద్దే అల్పాహారం చేసిన కార్మికులు అనంతరం అక్కడే బైఠాయించి ధర్నాకు దిగారు. మధ్యాహ్నం భోజనమూ అక్కడే చేసి రాత్రి అక్కడే నిద్రించారు. బీఆర్ఎస్ భద్రాచలం నాయకుడు ఆకోజు సునీల్ తదితర నాయకులు సమ్మె శిబిరాన్ని సందర్శించి బీఆర్ఎస్ తరఫున మద్దతు తెలిపారు. అనంతరం సమ్మె శిబిరం వద్ద వెంకటేశ్వర్లు, బ్రహ్మచారి, విజయ్ మాట్లాడారు. జిల్లాకు చెందిన భట్టి విక్రమార్క ఆర్థిక శాఖ మంత్రిగా ఉండి కూడా.. గిరిజనుల జీతాలు తగ్గించడం అన్యాయమని విమర్శించారు. సమస్యలను పరిష్కరించకపోతే పాలనా వ్యవస్థను స్తంభింపజేస్తామని హెచ్చరించారు. జేఏసీ నాయకులు పాల్గొన్నారు.