కారేపల్లి, ఆగస్టు 07 : హైకోర్టు న్యాయవాది, ఖమ్మం జిల్లా సింగరేణి మండల పరిధిలోని గేట్ కారేపల్లి గ్రామానికి చెందిన పరస అనంత నాగేశ్వరరావు (45) గుండెపోటుతో గురువారం మరణించారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. విధుల్లో భాగంగా నాగేశ్వరరావు నేడు హైదరాబాద్లోని హైకోర్టుకు వెళ్లాడు. కోర్టు ఆవరణలో కేసులకు సంబంధించిన ఫైళ్లను పరిశీలిస్తుండగా అకస్మాత్తుగా చాతిలో నొప్పితో పాటు గుండెపోటు రావడంతో కోర్టు ప్రాంగణంలోని కుప్పకూలాడు. తోటి లాయర్లు, సిబ్బంది హుటాహుటిన ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేయగా అప్పటికే మృతి చెందాడు. అనంత నాగేశ్వరరావు అకాల మరణం పట్ల గ్రామంలో విశాద ఛాయలు అలుముకున్నాయి. నాగేశ్వరరావుకు భార్య, కొడుకు, కూతురు ఉన్నారు.