మధిర, అక్టోబర్ 26 : మధిరలో జిల్లా అదనపు కోర్టు మంజూరు అంశాన్ని పరిశీలిస్తామని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి పి.శ్రీసుధ అన్నారు. మధిర పట్టణంలో రూ.24 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న మున్సిఫ్ కోర్టుతోపాటు సబ్ సివిల్ కోర్టులు, రూ.39 లక్షల వ్యయంతో నిర్మిస్తున్న రికార్డ్స్ భవన నిర్మాణ పనులకు హైకోర్టు న్యాయమూర్తి,
జిల్లా పరిపాలనా న్యాయమూర్తి శ్రీసుధ, హైకోర్టు న్యాయమూర్తులు భీమపాక నగేశ్, కాజా శరత్, ఖమ్మం ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ సెషన్స్ జడ్జి జి.రాజగోపాల్‌తో కలిసి శనివారం భూమి పూజ చేశారు. భవన నిర్మాణ మ్యాపును న్యాయమూర్తులు పరిశీలించారు. అనంతరం రిక్రియేషన్ క్లబ్ కాంప్లెక్స్‌లో నూతనంగా మంజూరైన సబ్ సివిల్ కోర్టును ప్రారంభించారు.
ఈ సందర్భంగా హైకోర్టు న్యాయమూర్తి శ్రీసుధ మాట్లాడుతూ దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన యోధుల ప్రాంతంలో నూతన కోర్టు భవన నిర్మాణాలకు భూమి పూజ చేయడం గర్వంగా ఉందన్నారు. గతంలో ఇక్కడి ప్రజలు పడిన ఇబ్బందుల గురించి స్థానిక న్యాయవాదులు తన దృష్టికి తెచ్చారని, అలాగే బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జిల్లా అదనపు కోర్టు మంజూరు చేయాలని కోరారన్నారు. దీంతో సబ్ సివిల్ కోర్టు మంజూరు చేశామన్నారు.
తాత్కాలికంగా అద్దె భవనాల్లో కోర్టు నిర్వహణ కొనసాగుతుందన్నారు. భవన నిర్మాణ పనులు ప్రారంభించి.. అగ్రిమెంట్ తేదీలోగా పనులన్నీ పూర్తి చేయాలన్నారు. అనంతరం హైకోర్టు న్యాయమూర్తులను బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో మధిర సీనియర్ సివిల్ జడ్జి మీరాఖాసీం సాహెబ్, మున్సిఫ్ కోర్టు న్యాయమూర్తి టి.కార్తీక్‌రెడ్డి, బార్ అసోసియేసన్ అధ్యక్షుడు బి.పుల్లారావు, కార్యదర్శి గోపాలం, ఆర్అండ్బీ ఎస్ఈ హేమలత, మున్సిపల్ కమిషనర్ సంపత్‌కుమార్, తహసీల్దార్ రాంబాబు, న్యాయవాదులు పాల్గొన్నారు.