దమ్మపేట, మార్చి 2 : దేశంలోని న్యాయస్థానాల్లో కేసులు పేరుకుపోయాయని, సగటున గంటకు వంద కేసులు పరిష్కరిస్తే.. పెండింగ్ కేసుల పరిష్కారానికి 33 ఏళ్ల కాలం పడుతుందని తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నగేశ్ భీమపాక అన్నారు. దమ్మపేటలో ఏర్పాటు చేసిన జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ప్రారంభ కార్యక్రమంలో శనివారం న్యాయమూర్తులు జస్టిస్ వేణుగోపాల్, జస్టిస్ కె.శరత్‌లతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ న్యాయస్థానాల్లో బార్, బెంచ్‌ల సమన్వయంతోనే తీర్పులు వెలువడతాయన్నారు. ఈ క్రమంలో న్యాయవాదిగా తన అనుభవాన్ని ఆయన పంచుకున్నారు. చింతూరు అటవీ ప్రాంతంలో నివసించే కడు నిరుపేద హైదరాబాద్ వచ్చి తమకు జరిగిన అన్యాయాన్ని ప్రస్తావిస్తూ.. అడవిలోని క్రూర మృగాలు తమపై దాడి చేసి తాము పెంచుకున్న మేకనో, గొర్రెనో, కోడినో, పశువునో మాత్రమే ఎత్తుకెళ్తాయని, కానీ.. కొందరు(న్యాయవాదులు) తమ సర్వస్వాన్నే దోచేశారని చెప్పిన విషయంతో తాను పది రోజులు నిద్రలేని రాత్రులు గడిపానని గుర్తు చేసుకున్నారు.
తనతో అటవీ శాఖ అధికారులు మొక్క నాటించారని, తాను 20 ఎకరాలు సంపాదించి.. అందులో అడవిని పెంచాలన్నది తన జీవితాశయమన్నారు. జస్టిస్ వేణుగోపాల్ మాట్లాడుతూ సమస్యల పరిష్కారానికి ఆఖరి ప్రయత్నంగా కోర్టులను ఆశ్రయించాలని అన్నారు. కేసులు సంపాదనకు మార్గం కారాదన్నారు. జస్టిస్ కె.శరత్ మాట్లాడుతూ తన న్యాయవాది వృత్తి సమయంలో దమ్మపేట మండలంలో తన క్లయింట్స్ ఉండేవారన్నారు. పేదలకు న్యాయం చేయడానికి ఈ కోర్టు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. జిల్లా జడ్జి వసంత్ పాటిల్ మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు అభ్యర్థన మేరకు కోర్టు ఇల్లెందు నుంచి దమ్మపేటకు మార్చడానికి అన్ని చర్యలు పూర్తి చేశామన్నారు. కొన్ని సాంకేతిక కారణాలతో ప్రారంభంలో జాప్యం జరిగిందన్నారు. కోర్టు ఏర్పాటులో సత్తుపల్లి బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ కీలక పాత్ర పోషించారన్నారు. కార్యక్రమంలో దారా యుగంధర్, న్యాయవాదులు పాల్గొన్నారు.