ఖమ్మం : కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి పట్ల రైతులు ఉద్యమించాలని సీపీఐ జాతీయ కమిటీ సభ్యుడు భాగం హేమంతరావు అన్నారు. రైతు భరోసా పథకం(Rythu bharosa) అమలు అయ్యేందుకు వ్యవసాయ రెవెన్యూ, ఆర్థిక శాఖల అవసరం ఉంటుందని ఈ మూడు శాఖలకు సంబంధించి జిల్లాలో మంత్రులు ఉన్నప్పటికీ రైతు భరోసా పథకం పూర్తి స్థాయిలో అమలు కావట్లేదని ఆరోపించారు. శుక్రవారం ఏఐకేఎస్ ఖమ్మం రూరల్ మండలం మహాసభ రైతు సంఘం నాయకుడు ఏలూరు భాస్కర్ అధ్యక్షతన ఆరెకోడు గ్రామంలో జరిగింది. ఈ సభకు హాజరై ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వం ఎలాంటి కొర్రీలు పెట్టకుండా రైతుబంధు పథకం అమలు చేసిందన్నారు.
కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు భరోసా పథకం అమలు కావట్లేదన్నారు. జిల్లాలో వ్యవసాయ శాఖ, రెవెన్యూ శాఖ, ఆర్థిక శాఖ మంత్రులు ఉన్నప్పటికీ రైతులకు ప్రయోజనం లేకుండా పోయిందని విమర్శించారు. రెండు లక్షల రుణమాఫీ పథకం సైతం సగానికి సగం రైతులకు అందలేదన్నార. ఇటీవల ప్రకటించిన పంటల బోనస్ నిధులు సైతం పెండింగ్లో ఉన్నాయన్నారు. ఒకవైపు కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు అండగా ఉంటూ వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేస్తుందని మండిపడ్డారు.
మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను అవలంభిస్తుందని విమర్శించారు. రైతులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరికి నిరసనగా పోరాటాలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. తక్షణం స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు అమలు చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. కేరళ రాష్ట్ర ప్రభుత్వం 14 రకాల పంటలకు బోనస్ ఇస్తూ రైతులను ఆదుకుంటున్న సంగతిని ఆయన గుర్తు చేశారు.