కూసుమంచి, ఆగస్టు 12 : ఎగువ వర్షాలతోపాటు స్థానికంగా కురిసిన వానతో పాలేరు జలాశయానికి వరద నీరు పోటెత్తింది. వరద ప్రవాహం సోమవారం అర్ధరాత్రి నుంచి పెరుగుతుండడంతో ఆటోమెటిక్ గేట్ల నుంచి నీటిని దిగువకు వదులుతున్నారు. పాలేరు పూర్తిస్థాయి నీటిమట్టం 23 అడుగులు కాగా.. అంతకు మించి 24 అడుగులకుపైగా నీరు చేరింది. 2.588 టీఎంసీల నీటి సామర్థ్యం ఉండగా.. ప్రస్తుతం 2.5 టీఎంసీల వరకు చేరింది. మంగళవారం సాయంత్రం వరకు 13,500 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండగా.. అదే స్థాయిలో దిగువకు నీటిని వదులుతున్నారు.
దీంతో సాగర్ నుంచి విడుదలవుతున్న నీటి ప్రవాహాన్ని అధికారులు తగ్గించారు. కూసుమంచిలోని గంగదేవి చెరువు మత్తడి పోస్తుండడంతో కూసుమంచి-కిష్టాపురం రహదారిపై రాకపోకలకు ఇబ్బంది కలిగింది. ట్రాక్టర్లు అడ్డుగా పెట్టి వాహనాలను నిలిపివేశారు. కూసుమంచి-తురకగూడెం మధ్య వాగు, నర్సింహులగూడెం-కొత్తూరు మధ్య వాగు, కిష్టాపురం-వెంకట్రాంపురం మధ్య వాగుల్లోకి వరద నీరు చేరడంతో రాకపోకలు నిలిచిపోయారు. చౌటపల్లి, జీళ్లచెరువు, ఈశ్వరమాధారం, శనగకుంట చెరువులు అలుగు పోస్తున్నాయి.
పాలేరుకు రెండు మూడు రోజుల నుంచి వరద ప్రవాహ పెరుగుతుండడంతో సిబ్బందిని అప్రమత్తం చేసినట్లు నీటిపారుదల శాఖ ఎస్ఈ మంగళంపుడి వెంకటేశ్వర్లు తెలిపారు. మంగళవారం సాయంత్రం పాలేరు స్పెషల్ ఆఫీసర్ రమేశ్, ఏసీపీ తిరుపతిరెడ్డి, ఈఈ అనన్య, సీఈ సంజీవ్, డీఈ రత్నకుమారి, తహసీల్దార్ రవికుమార్, ఎంపీడీవో రామచందర్రావు, ఏవో వాణి, ఎస్సై నాగరాజులతో కలిసి పాలేరు జలాశయాన్ని ఆయన సందర్శించారు. వరద క్రమంగా పెరిగినా తగిన జాగ్రత్తలు తీసుకున్నామని, రంగుల బ్రిడ్జి వద్ద నుంచి నీటిని మళ్లించామని పేర్కొన్నారు. పాలేరు అలుగుల వద్దకు ఎవరూ వెళ్లకుండా తగిన భద్రత ఏర్పాటు చేసినట్లు వివరించారు.
తిరుమలాయపాలెం/మధిర, ఆగస్టు 12 : జిల్లాలోని రెండు మండలాల్లో సోమవారం అర్ధరాత్రి, మంగళవారం భారీ వర్షం కురిసింది. దీంతో పలు గ్రామాల్లో వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. చెరువులు, కుంటలు పూర్తిగా నిండి అలుగు పారుతున్నాయి. తిరుమలాయపాలెం మండలం బీరోలు, బచ్చోడు, సుబ్లేడు, మేడిదపల్లి, హస్నాబాద్ రాజారం తదితర గ్రామాల్లో భారీ వర్షం కురిసింది. మేడిదపల్లి-సుబ్లేడు మధ్య వాగు పొంగిపొర్లుతుండడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.
బందంపల్లి-బచ్చోడు మధ్య చెరువు అలుగు పోస్తుండడంతో రవాణా వ్యవస్థకు అంతరాయం ఏర్పడింది. బోనకల్లు, మధిర, చింతకాని మండలాల్లో సోమవారం అర్ధరాత్రి భారీ వర్షం కురిసింది. పలు ప్రాంతాల్లోని వాగులు పెద్ద ఎత్తున పొంగి పొర్లడంతో ఆ నీరంతా చెరువులు, మున్నేరుకు చేరుకుంటుంది. చింతకాని మండలం నాగులవంచ-పాతర్లపాడు గ్రామాల మధ్య రాళ్ల వాగు పొంగిపొర్లడంతో రోడ్డుపైకి వరద నీరు చేరింది. దీంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.