ఖమ్మం వ్యవసాయం, అక్టోబర్ 15 : జిల్లాలో వారం, పది రోజులుగా పత్తి పంట చేతికొస్తున్నా కొనుగోలు కేంద్రాల జాడ కనిపించడం లేదు. పంట సీజన్‌కు ముందుగానే కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాల్సి ఉండగా.. ఆ దిశగా అడుగులు ముందుకు పడలేదు. దీంతో మొదటి తీతను పూర్తి చేసిన రైతులు ఇంట్లో నిల్వ చేసుకోలేక తమ పంటను ప్రైవేటు వ్యాపారులు, దళారులకు అమ్ముకుంటూ తీవ్రంగా నష్టపోతున్నారు.
ఈ ఏడాది వానకాలంలో వివిధ రకాల పంటలు సాగు చేసిన రైతులకు ఏమాత్రం కలిసి రాలేదని చెప్పొచ్చు. భారీ వర్షాలు, వరదలతో ఒకవైపు పంటలు దెబ్బతినగా, మరోవైపు పంటలను చీడపీడలు ఆశించడంతో దిగుబడులపై ప్రభావం చూపింది. దీంతో మిర్చి తోటలు, వరి పొలాలతోపాటు అక్కడక్కడా పత్తి కాయలు రాలిపోవడం, దూది రంగు మారడంతో భారీగా నష్టం వాటిల్లింది. జిల్లాలో ఈ ఏడాది రైతులు 2 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేశారు. దాని ద్వారా దాదాపు 1.80 లక్షల మెట్రిక్ టన్నుల పంట దిగుబడి వచ్చే అవకాశం ఉంటుందని అధికారులు అంచనా వేశారు.
కొనుగోళ్లపై సమీక్షలతోనే సరి..
జిల్లాలో పత్తి పంట దిగుబడిని బట్టి కొనుగోళ్ల కోసం ఇప్పటికే పలుమార్లు సీసీఐ కేంద్రాలు, కావాల్సిన మౌలిక వసతుల కల్పన తదితర అంశాలపై అధికారులు జిల్లాస్థాయిలో సమీక్షలు నిర్వహించారు. అయితే అధికారులు ఊహించినదాని కంటే ముందుగానే అంటే.. గడిచిన పక్షం రోజులుగా రైతులు పత్తి పంటను విక్రయానికి మార్కెట్‌కు తరలిస్తున్నారు. జిల్లాలో అడపా దడపా కురుస్తున్న అకాల వర్షాలు, తేమ శాతం లేదా మరే కారణమోగానీ ఇప్పటివరకు సీసీఐ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయలేదు. ఈ ఏడాది వివిధ మార్కెట్ల పరిధిలో ఉన్న తొమ్మిది జిన్నింగ్ మిల్లుల వద్ద సీసీఐ కేంద్రాల ఏర్పాటుకు సైతం అధికారులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
అయితే ప్రైవేట్ ఖరీదుదారులు పత్తి పంటను భారీగా కొనుగోలు చేస్తున్నా.. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో మార్కెట్ యార్డుకు పత్తి పంటను తీసుకొచ్చిన రైతులు అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. సీసీఐ కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో రైతులు తమ పంటను దళారులకు విక్రయించాల్సి వస్తున్నది. అప్పు చేసి సాగుకు పెట్టుబడి పెట్టిన రైతులు వడ్డీలు కట్టలేక చేతికొచ్చిన పంటను వెంటనే అమ్ముకోవాల్సి వస్తున్నది. దీనిని ఆసరా చేసుకున్న దళారులు అందిన కాడికి రైతులను దోచుకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు.
విక్రయానికి 3 వేల బస్తాల రాక..
ఖమ్మంలోని వ్యవసాయ మార్కెట్ పరిధిలో గల పత్తి యార్డుకు ఆయా మండలాలకు చెందిన రైతులు మంగళవారం రికార్డు స్థాయిలో 3 వేల పత్తి బస్తాలను విక్రయానికి తరలించారు. ఈ ఏడాది సీసీఐ క్వింటా పత్తికి మద్దతు ధర రూ.7,500 నిర్ణయించగా.. ఉదయం జరిగిన ఆన్లైన్ బిడ్డింగ్‌లో క్వింటా గరిష్ట ధర రూ.7 వేలు పలికింది. మధ్య ధర క్వింటాల్ రూ.6,700 కాగా, కనిష్ట ధర రూ.5,500గా నిర్ణయించి ప్రైవేట్ ఖరీదుదారులు పత్తిని కొనుగోలు చేశారు. అదే.. సీసీఐ కేంద్రాలు ఏర్పాటు చేస్తే క్వింటాకు రూ.500 నుంచి రూ.700 వరకు అదనంగా రైతులకు ధర లభించే అవకాశం ఉంది. ఇప్పటికైనా సీసీఐ అధికారులు స్పందించి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి మద్దతు ధర కల్పించాలని ఆయా మండలాలకు చెందిన పత్తి రైతులు డిమాండ్ చేస్తున్నారు.
రెండు, మూడు రోజుల్లో ప్రారంభిస్తాం..
సీసీఐ కేంద్రాలను ప్రారంభించడానికి అన్ని రకాల చర్యలు తీసుకున్నాం. ఏర్పాటు చేయనున్న కేంద్రాలకు సంబంధించి సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ కార్యక్రమం నడుస్తున్నది. కేంద్రాల్లో పూర్తి మౌలిక వసతులు ఏర్పాటు చేసి రెండు, మూడు రోజుల్లో కేంద్రాలను రైతులకు అందుబాటులోకి తీసుకొస్తాం. పత్తిని పూర్తిగా ఆరబెట్టుకొని నాణ్యమైన కేంద్రాలకు తరలిస్తే మంచి ధర పొందే అవకాశం ఉంటుంది.
-ఎంఏ అలీం, జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి, ఖమ్మం