కల్లూరు, సెప్టెంబర్ 9: జాతీయ పార్టీగా 50 ఏళ్లు పాలించిన కాంగ్రెస్.. ప్రజలకు చేసిందేమీ లేదని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అనేక సంక్షేమ పథకాలను చూసి ఆ పార్టీ నాయకులు ఓర్వలేకపోతున్నారని విమర్శించారు. అందుకే ప్రజలకు మాయమాటలు చెబుతున్నారని అన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్టాల్లో ఎంతటి అభివృద్ధి చేస్తున్నదో చెప్పాలని డిమాండ్ చేశారు. కల్లూరు మండలంలోని 67 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను, జీవో 59 జీవో కింద 27 మందికి ఇళ్ల పట్టాలను కల్లూరు రైతు వేదికలో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో పంపిణీ చేసి మాట్లాడారు. గత పాలకులెవరూ చేయలేని విధంగా తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి చేస్తోందని అన్నారు. రూ.వేల కోట్లతో సత్తుపల్లి నియోజకవర్గంలో అనేక అభివృద్ధి పనులు జరుగుతున్నాయని వివరించారు.
దివ్యాంగులకు రూ.4 వేల పింఛన్ ఇస్తున్న రాష్ట్రం దేశంలోకెల్లా తెలంగాణ మాత్రమేనని స్పష్టం చేశారు. తాము అధికారంలోకి వస్తే పింఛన్లు పెంచుతామంటూ, ఇళ్లు ఇస్తామంటూ కాంగ్రెస్ నాయకులు బ్రోచర్లు పట్టుకొని ఇంటింటికీ తిరుగుతుండడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. వారు అధికారంలో ఉన్న చోట ఇవన్నీ ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. అలా తిరుగుతున్న వారిలో నలుగురైదుగురూ తామే అభ్యర్థులమని చెప్పుకుంటుండడం విడ్డూరంగా ఉందని, అసలు అభ్యర్థులెవరో వారిలో వారికే తెలియదని విమర్శించారు. దళితబంధు పథకాన్ని జాతీయస్థాయిలో ప్రకటించే ధైర్యముందా? అంటూ కాంగ్రెస్‌ను ప్రశ్నించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు బాబ్జీ ప్రసాద్, రవికుమార్, బీరవల్లి రఘు, కట్టా అజయ్‌బాబు, పాలెపు రామారావు, లక్కినేని రఘు, బోబోలు లక్ష్మణరావు, ఇస్మాయిల్, కాటంనేని వెంకటేశ్వరరావు, ఎస్కే కమ్లీ, పెడకంటి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
ఉద్యమకారులకు అరుదైన గౌరవం
తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించి తెలంగాణ ఫుడ్ కమిటీ బోర్డు మెంబర్‌గా నియమితురాలైన భూక్యా జ్యోతిని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భూక్యా జ్యోతి, ఆమె భర్త రాము ఉద్యమ సమయంలో తెలంగాణ జెండా పట్టుకుని తిరిగారని గుర్తుచేశారు. ఉద్యమకారులందరినీ సీఎం కేసీఆర్ గుర్తించి అరుదైన గౌరవం అందించడం గొప్ప విషయమని అన్నారు.