మామిళ్లగూడెం, ఫిబ్రవరి 20: ఖమ్మం జిల్లాకు చెందిన రిటైర్డ్ ఎస్సై మైసయ్య మృతి ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని మాజీ మంత్రి హరీశ్‌రావు ధ్వజమెత్తారు. మైసయ్య రిటైరై ఏడాదైనా రూ.60 లక్షల రిటైర్మెంట్ ప్రయోజనాలను ఇంకా అందించకపోవడం ప్రభుత్వ ఘోర వైఫల్యానికి నిదర్శనమని దుయ్యబట్టారు. రిటైర్మెంట్, ఆరోగ్య భద్రత ప్రయోజనాలు సకాలంలో అందని కారణంగా ఖమ్మానికి చెందిన రిటైర్డ్ ఎస్సై ఇటీవల మృతిచెందిన విషయంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ నేపథ్యంలో రేవంత్ ప్రభుత్వ వైఫల్యాన్ని మాజీ మంత్రి హరీశ్‌రావు శుక్రవారం ట్విట్టర్ (ఎక్స్) ద్వారా ఎండగట్టారు. రిటైర్మెంట్ ప్రయోజనాలు అందక, ఆసుపత్రి ఖర్చులకు ఆర్థిక వనరుల్లేక మైసయ్య ప్రాణాలు కోల్పోవడం తనకు తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందని అన్నారు. జీవితకాలం ప్రజల రక్షణ కోసం అహర్నిశలూ శ్రమించి ఒక పోలీస్ అధికారి దుస్థితికి కాంగ్రెస్ ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.