ఖమ్మం, ఏప్రిల్ 19 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ‘రేవంత్ పోవాలి.. కేసీఆర్ రావాలి..’ అని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారని బీఆర్ఎస్ శాసనసభాపక్ష నేత, మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు పేర్కొన్నారు. యావత్ రాష్ట్రంలో ఎవరి నోట విన్నా.. ఇదే మాట వినిపిస్తోందని స్పష్టం చేశారు. రెండున్నరేళ్ల కాంగ్రెస్ పాలన అన్నిరంగాలనూ నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు. అన్నివర్గాలను మోసం చేసిందని ఆరోపించారు. మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ జన్మదినం సందర్భంగా ఖమ్మం మమత కాలేజీ గ్రౌండ్లో ఆదివారం బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళన సభను నిర్వహించారు.
దీనికి హరీశ్‌రావు ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. రాష్ట్రంలో రైతుల రుణమాఫీ పూర్తిగా అమలైందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నిరూపిస్తే తక్షణమే తాను తన పదవికి రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నానని హరీశ్‌రావు స్పష్టం చేశారు. ‘ఇందుకు మంత్రి తుమ్మల సిద్ధమా’ అని సవాల్ విసిరారు. తుమ్మల ప్రాతినిథ్యం వహిస్తున్న రఘునాథపాలెం మండలంలో ఏ గ్రామంలోనైనా క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్దామని, వంద శాతం రైతుల రుణమాఫీ పూర్తయిందని నిరూపిస్తే తక్షణమే తాను రాజీనామా చేస్తానని, ఇదే విషయంపై తుమ్మల సిద్ధిపేటకు వచ్చి రైతులను అడిగి నిరూపించినా తన రాజీనామాకు సిద్ధమేనని తేల్చిచెప్పారు. ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వమని ధ్వజమెత్తారు.
రుణమాఫీ పూర్తయిందని శాసనసభ సాక్షిగా మంత్రి తుమ్మల బుకాయించారని దుయ్యబట్టారు. రుణమాఫీ చేయడం చేతగాకపోతే ప్రజలకు క్షమాపణ చెప్పాలే తప్ప ప్రభుత్వం అబద్ధాలు చెప్పడం ఎందుకని ప్రశ్నించారు. రైతుభరోసా పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు రైతులకు రూ.20 వేల కోట్లు ఎగవేసిందని, రైతుల ఆశలను అడియాశలు చేసిందని, అధికారం ఇచ్చిన పాపానికి రైతులను గోసపెడుతోందని విమర్శించారు. ఖమ్మం జిల్లా వరప్రదాయినిగా ఉన్న సీతారామ ప్రాజెక్టు పూర్తి చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోర వైఫల్యం చెందిందని, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన పని తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన పని శూన్యమని అన్నారు.
ఆంధ్రప్రదేశ్‌కు మేలు చేయడానికే సీతమ్మ సాగర్, సమ్మక్క సాగర్ వంటి పనులను రేవంత్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా నిలిపివేస్తోందని ఆరోపించారు. ముగ్గురు మంత్రులు, సాక్షాత్తూ వ్యవసాయశాఖ మంత్రి ఉన్న ఖమ్మం జిల్లాలో మొక్కజొన్న, ధాన్యం కొనుగోలు చేసే దిక్కులేకుండా పోయిందని ఆవేదన వ్యక్తంచేశారు. 2.67 లక్షల ఎకరాల్లో రాష్ట్రంలో అత్యధికంగా ఖమ్మం జిల్లా రైతులు మొక్కజొన్న పండిస్తే ప్రభుత్వం చేతగానితనం వల్ల రూ.2,500కు రావాల్సిన క్వింటా మొక్కజొన్నకు రూ.1,600కు దళారులకు అమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని, ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనూ ప్రభుత్వం పరిస్థితి ఇదేనని విమర్శించారు. జిల్లాలో ముగ్గురు మంత్రుల్లో ఒకరు బకాసురుడు కాగా, మరొకరు కమీషన్ల కింగ్ అని, ఇంకొకరికి పర్సంటేజీల మీదనే ధ్యాస అని దుయ్యబట్టారు.
ఈ ముగ్గురు మంత్రుల వల్ల ఖమ్మం జిల్లాకు ఒరగిందేమీ లేదన్నారు. ఈ మూడు తలకాయలు కలిసి ఖమ్మం జిల్లా కోసం ఒకేసారి చర్చించిన దాఖలాలు లేవన్నారు. ఒకరి కాళ్లు మరొకరు లాక్కోడంతోనే మంత్రుల పుణ్యకాలం పూర్తవుతుందని ఎద్దేవాచేశారు. రాష్ట్రంలో కమీషన్లు దండుకోవడం ఢిల్లీకి కప్పం కట్టడం ప్రభుత్వ పనిగా మారందని ఆరోపించారు. రెండున్నరేళ్లలో కేసీఆర్ కలలుగన్న సీతారామ ప్రాజెక్టును ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగానే పడుకోబెట్టిందని హరీశ్‌రావు విమర్శించారు.
వెలుగుమట్లలో ఇళ్లు కూలుస్తున్నప్పుడు పోలీసులు కన్నీరు పెట్టుకున్నా ఈ జిల్లా మంత్రుల గుండె మాత్రం కరగలేదని హరీశ్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు. వెలుగుమట్ల బాధితులందరికీ ప్రభుత్వమే ఇళ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. కానీ, బాధితులందరికీ ఇవ్వకుండా కేవలం 311మందికే ఇవ్వడం, అందులోనూ కాంగ్రెస్ వాళ్లకే ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. ఖమ్మంజిల్లాలో ఇసుక రీచ్‌లను కాంగ్రెస్ మాఫియా ఆక్రమించుకొని గిరిజనుల నోళ్లు కొడుతోందని ఆరోపించారు. జిల్లాకు ముగ్గురు మంత్రులు ఉండి నిరుటి వరదల సమయంలో హెలికాప్టర్ కూడా తెచ్చుకోలేని అసమర్థులయ్యారని దుయ్యబట్టారు. దీనివల్ల మూడు నిండు ప్రాణాలను బలి తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.
మంత్రి పొంగులేటి మైనింగ్ స్కామ్‌ను అసెంబ్లీలో తాము బయటపెడితే ప్రభుత్వం ఆగమాగమైందని హరీశ్‌రావు విమర్శించారు. పొంగులేటి మైనింగ్‌పై ఫైన్ కట్టించామని సీఎం చెప్పాడని, తనకు మైనింగే లేదని పొంగులేటి బుకాయించాడని, స్పెషల్ అనుమతుల కోసం కేంద్రానికి దరఖాస్తు చేశారని మైనింగ్ మంత్రి చెప్పారని గుర్తుచేశారు. ముగ్గురు కీలక నేతలు మూడు రకాలుగా మాట్లాడినప్పుడే రాష్ట్ర ప్రజలు పూర్తిగా అర్థమైందన్నారు. ఈ ప్రభుత్వం జర్నలిస్టులను కూడా మోసం చేసిందని, కనీసం అక్రిడిటేషన్ కార్డులను సైతం ఇవ్వలేకపోయిందని ధ్వజమెత్తారు. కాగా, ఆత్మీయ సమ్మేళనానికి భారీఎత్తున పార్టీ శ్రేణులు తరలిరావడంతో జిల్లాలో బీఆర్ఎస్లో నూతనోత్సాహం ఉరకలేసింది. బీఆర్ఎస్ నేతలు పగడాల నాగరాజు, ఎమ్మెల్సీ తాతా మధు, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యేలు సండ్ర వెంకట వీరయ్య, మెచ్చా నాగేశ్వరరావు, తాటి వెంకటేశ్వర్లు, జడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్‌రాజు, నేతలు బానోతు మంజుల, ఆర్జేసీ కృష్ణ, బచ్చు విజయ్‌కుమార్, కూరాకుల నాగభూషణం, బొమ్మెర రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు.
ఖమ్మం సిటీ, ఏప్రిల్ 19: ‘బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో లబ్ధి పొంది.. కేవలం పదవి దక్కలేదనే అక్కసుతో.. గత ఎన్నికల్లో అబద్ధాలు ప్రచారం చేసి.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ అభ్యర్థులను అసెంబ్లీ గేటు తాకనివ్వనని ఒకాయన విర్రవీగిండు. మాయమాటలతో, గ్యారెంటీల పేరుతో ప్రజలను ఏమార్చి ఎన్నికల్లో గెలిచారు. అధికారంలోకి వచ్చి రెండున్నరేండ్లు దాటింది. ముగ్గురు మంత్రులుగా వ్యవహరిస్తున్నారు. కానీ, ఏ ఒక్క వర్గానికీ మేలు చేయలేదు సరికదా పేదలను రోడ్డుపాలు చేశారు.
ఇప్పుడు చెబుతున్నా.. ‘కాంగ్రెస్సోళ్లూ.. కాచుకోండి..’ వచ్చే 2029 అసెంబ్లీ ఎన్నికల్లో మీలో ఒక్కరిని కూడా అసెంబ్లీ గేటు తాకనివ్వను’ అని మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ సవాల్ చేశారు. ఆదివారం సాయంత్రం తాను అరవై ఒకటో సంవత్సరంలోకి అడుగుపెడుతున్న నేపథ్యంలో ఖమ్మంలోని మమత ఆసుపత్రి ప్రాంగణం ఫుట్‌బాల్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన ఆత్మీయ సభలో భావోద్వేగ ప్రసంగం చేసి కార్యకర్తల్లో జోష్ నింపారు. వచ్చే సాధారణ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో ఎన్ని సీట్లు ఉంటే అన్నిట్లో బీఆర్ఎస్ అభ్యర్థులు విజయకేతనం ఎగురవేస్తారని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్‌ను మరోసారి ముఖ్యమంత్రిగా చూడాలన్నదే తన ఏకైక లక్ష్యమన్నారు.
అందుకే తనకు భగవంతుడు సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించాడని, ఇది తనకు పునర్జన్మలాంటిదని వ్యాక్యానించారు. ఒంటిచేత్తో కోట్లాది మంది ప్రజల ఆకాంక్ష అయిన తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిపెట్టిన కేసీఆర్‌పై ఖమ్మానికి చెందిన ఒక మంత్రి అవాకులు చవాకులు పేలుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లాను బంగారు తునకగా మార్చిన ఘనత కేవలం మాజీ సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. పార్టీకి చెందిన కార్పొరేటర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, ముఖ్యనాయకులు, కార్యకర్తలను బెదిరిస్తున్నారని, వారి దౌర్జన్యం ఎంతోకాలం సాగదని, ప్రతి కార్యకర్తను కాపాడుకునేందుకు తాను రంగంలోకి దూకుతున్నానని ప్రత్యర్థులకు హెచ్చరిక చేశారు.
తెలంగాణలో అభివృద్ధి అటకెక్కిందని, ప్రజా సంక్షేమం గాలిలో కలిసి కేవలం పోలీసు రాజ్యం నడుస్తోందని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర అన్నారు. ప్రస్తుతం బీఆర్ఎస్ శ్రేణుల జోష్ చూస్తుంటే ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ ఖాళీకావడం ఖాయంగా కనిపిస్తోందన్నారు. బీఆర్ఎస్ ఖమ్మం నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు అధ్యతన సాగిన సమ్మేళనంలో ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ మాట్లాడుతూ కష్టకాలంలో పార్టీకి వెన్నుదన్నుగా నిలుస్తున్న ప్రతి నాయకుడు, కార్యకర్తకు ప్రత్యేక అభినందనలు తెలిపారు.
ఖమ్మం మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ.. అధికారం శాశ్వతం కాదని, అభివృద్ధి మాత్రమే శాశ్వతమనే నిజాన్ని కాంగ్రెస్ మంత్రులు గుర్తుంచుకోవాలని సూచించారు. మాజీ ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, మెచ్చా నాగేశ్వరరావు, తాటి వెంకటేశ్వర్లు, గట్టు రామచందర్‌రావు, రాకేష్‌రెడ్డి, లింగాల కమల్‌రాజు, నాయకులు కూరాకుల నాగభూషణం, ఎండీ ఖమర్, బొమ్మెర రామ్మూర్తి, ఉప్పల వెంకటరమణ, అజ్మీరా వీరూనాయక్, కార్పొరేటర్లు కర్నాటి కృష్ణ, మక్బుల్, తోట రామారావు, బచ్చు విజయ్, బత్తుల మురళి, బీరెడ్డి నాగచంద్రారెడ్డి, తాజుద్దీన్, దేవభక్తిని కిషోర్‌కుమార్, కౌన్సిలర్లు, సర్పంచులు, ముఖ్యనాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
బీఆర్ఎస్ శ్రేణుల ఆత్మీయ సమ్మేళనంలో మాజీ మంత్రి పువ్వాడ అజయ్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉప నేత హరీశ్‌రావు, నేతల సమక్షంలో వేదిక మీద అజయ్ తన బర్త్‌డే కేక్ కట్ చేశారు. అనంతరం, అతిథులు శాలువాలతో అజయ్‌ను సత్కరించారు. పుష్పగుచ్ఛాలు అందించి బర్త్‌డే విషెస్ తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అజయ్ నిండు నూరేళ్లూ వర్ధిల్లాలని, కేసీఆర్ సారథ్యంలో బీఆర్ఎస్ పటిష్టతకు కృషిచేయాలని ఆకాంక్షించారు.