ఖమ్మం అర్బన్, అక్టోబర్ 26: విద్యాలయాల్లో భద్రత కరువైంది. బాలల భద్రతకు భరోసానివ్వాల్సిన పాఠశాలలు భక్షక నిలయాలుగా మారుతున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో సాధారణంగా పేద, మధ్య తరగతికి చెందిన వారే అధికంగా విద్యనభ్యసిస్తున్నారు. ఈ నేపథ్యంలో గురువులు, పర్యవేక్షకుల వక్రబుద్ధి కారణంగా బాలికలపై లైంగిక వేధింపులు నానాటికీ పెరుగుతున్నాయి. ఈ విషయం బయటికి పొక్కే సందర్భాల్లో తోటి ఉపాధ్యాయులు, పర్యవేక్షకులు కలిసి తల్లిదండ్రులను, గ్రామపెద్దలను ప్రాథేయపడుతూ విషయం వెలుగులోకి రాకుండా చేస్తున్న ఉదంతాలే అనేకం. కొందరు తల్లిదండ్రులు తమ కుటుంబ నేపథ్యం దృష్ట్యా పరువుపోతుందని భయపడి తమ కుమార్తెలను చదువు మాన్పించిన సంఘటనలూ ఉన్నాయి. కొన్ని ఘటనలు మాత్రమే పోలీసు కేసుల వరకు వెళ్తున్నాయి.
కానీ వక్ర గురువులు, పర్యవేక్షకుల రాయ‘బేరా’ల ఫలితంగా న్యాయస్థానాల ముందు కేసులు వీగిపోతున్నాయి. దీంతో కీచకులు దర్జాగా తమ సస్పెన్షన్లను ఎత్తివేయించుకోవడంతోపాటు తిరిగి తమ ఉద్యోగాలు అనుభవిస్తూ ఉద్యోగోన్నతులూ పొందుతున్నారు. దీంతో చాలామంది తల్లిదండ్రులు తమ బిడ్డలకు జరిగిన అన్యాయాలపై ఫిర్యాదు చేయడానికి సైతం వెనుకంజ వేస్తున్నారు. ఫిర్యాదు చేసినా కీచకులు క్షేమంగానే బయటపడుతుండడంతో చివరకు తమ పరువేపోతుంది కానీ లైంగిక వేధింపులకు పాల్పడిన వారికి ఏమికాదనే భావన నానాటికీ పెరుగుతున్నది. దీంతో మరికొందరు అదే బుద్ధి కలిగిన ఉద్యోగులు సైతం తోటి మహిళా ఉద్యోగులు, సిబ్బంది పట్ల అసభ్య ప్రవర్తన, వెకిలిచేష్టలకు పాల్పడుతున్నారు.
విద్యాలయాల్లో బాలికల భద్రతపై ఖమ్మం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ప్రత్యేక దృష్టి సారించారు. విద్యార్థుల ప్రగతి కోసం ప్రత్యేక విద్యా ప్రణాళికలు రూపొందించి గత వారం నుంచి అమలు చేస్తున్నారు. ముఖ్యంగా బాలికలకు తగిన రక్షణ కల్పించాలని, వారి భద్రతకు పాఠశాలలు భరోసానివ్వాలని ఆయన సంకల్పించారు. దీంతో ఇప్పటివరకు వెలుగులోకి వచ్చిన కీచక గురువులు, పర్యవేక్షకుల ఉదంతాలు, పోక్సో కేసులు, వాటి ఫలితాలు తదితర సమగ్ర సమాచారాన్ని కలెక్టర్ తెప్పించుకున్నారు. గత శుక్రవారం అధికారులతో కలెక్టర్ ప్రత్యేక సమీక్ష సైతం నిర్వహించారు. కీచక వ్యవహారశైలి ఉన్న ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పర్యవేక్షక అధికారులపై కఠినచర్యలు తీసుకోకపోవడం వల్లనే ఈ ఉదంతాలకు అడ్డుకట్ట పడటం లేదని కలెక్టర్ సీరియస్ అయినట్లు తెలిసింది. విచారణాధికారులు, ఇతర పర్యవేక్షక అధికారులు కీచకుల పట్ల ఉదాసీనంగా వ్యవహరించడం వల్లే న్యాయస్థానాల్లో వారికి శిక్షలు పడడం లేదని నిర్ణయానికి వచ్చారు. ఇకపై బాలల భద్రతకు అన్నిస్థాయిల ఉద్యోగులు, అధికారులు ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలని కలెక్టర్ ఆదేశించారు. దీని కోసం సమగ్ర ప్రణాళికను సైతం రూపొందిస్తున్నట్లు తెలిసింది.
తమకు అధికారుల అండదండలు, ప్రజాప్రతినిధుల ఆశీస్సులు ఉన్నాయని కీచకులు ధీమాగా ఉంటున్నారు. ఇటువంటి వారి పీచమణచాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. లేనిపక్షంలో బాలికల విద్య కేవలం నినాదాలకే పరిమితమయ్యే ప్రమాదం ఉంది. ప్రభుత్వ బడులకే మాయని మచ్చగా పరిణమించిన లైంగిక ఉదంతాలపై ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాలు సైతం ఆత్మ విమర్శ చేసుకోవాలి. ఇకనైనా జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించి వెలుగుచూడని సంఘటనలపై సైతం సమగ్ర విచారణ చేసి నిగ్గు తేల్చి చర్యలు తీసుకోవాలి. అప్పుడే అటువంటి చర్యలకు పాల్పడే వారికి భయం కలుగుతుందని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.