కారేపల్లి, నవంబర్ 10 : కారేపల్లి హమాలీ వర్కర్స్ యూనియన్ నాయకుడు, స్టేషన్ బజార్ హమాలీ జగ్గాని రాజు (56) సోమవారం గుండెపోటుతో మృతి చెందాడు. సీఐటీయూ సభ్యుడిగా చురుగ్గా ఉండే రాజు మృతి పట్ల సీఐటీయూ నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. మృతదేహాన్ని సీఐటీయూ మండల కన్వీనర్ కె.నరేంద్ర, హమాలీ వర్కర్ యూనియన్ (సీఐటీయూ) గౌరవ అధ్యక్షుడు ముక్కా సీతారాములు, అధ్యక్షుడు ఆరెల్లి శ్రీరాములు సందర్శించి ఎర్రజెండా కప్పి నివాళ్లు ఆర్పించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ 32 సంవత్సరాలుగా పనిచేసినా ఎలాంటి ఆధారం లేక పోవడం, రోగానికి సరైన వైద్యం అందని పరిస్ధితి ఉందన్నారు.
హమాలీలకు సమగ్ర చట్టం లేకపోవడం వల్ల జీవితాలకు భరోసా కల్పించలేని దుస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. హమాలీ కూలిపై ఆధారపడిన బాధితుడి కుటుంబ సభ్యులకు ఎలాంటి ఆధారం లేకుండా పోయిందన్నారు. కారేపల్లి వ్యాపార వర్గాలు, హమాలీ వర్కర్స్ యూనియన్ నాయకులు కేతమళ్ల సారయ్య, ఆరెల్లి రమేశ్, తిరుపతయ్య, సంపత్, కేతమళ్ల సైదులు, లాలయ్య, సీతారాములు నివాళులర్పించిన వారిలో ఉన్నారు.