కారేపల్లి, ఏప్రిల్ 08 : ఖమ్మం జిల్లా కారేపల్లి మండల పరిధిలోని పేరేపల్లి గ్రామంలో కొలిచిన వారికి కొంగుబంగారంగా విరాజిల్లుతున్న శ్రీగురవమ్మ తల్లీ జాతర ఈ నెల 12 నుంచి 17వ తేదీ వరకు ఘనంగా జరుగనుందని ఆలయ కమిటీ చైర్మన్ కంచర్ల శ్రీనివాసరెడ్డి మంగళవారం తెలిపారు. ఆలయ ప్రాంగణంలో ఆయన మాట్లాడుతూ.. జాతర అంగరంగ వైభవంగా శనివారం నుండి గురువారం వరకు జరుగుతుందన్నారు. 12వ తేదీ ఉదయం 7 గంటల నుండి నిత్యపూజలు ప్రారంభమై సాయంత్రం 6 గంటలకు పసుపు కుంకుమ పూజలు,
13వ తేదీన జల బిందెలు, 14వ తేదీన సాయంత్రం 6 గంటల నుండి 8 గంటల వరకు అమ్మవారి కల్యాణం అనంతరం స్వామివార్ల ఊరేగింపు, 15వ తేదీన సాయంత్రం 6 గంటలకు పూల కప్పెర, 16వ తేదీ సాయంత్రం 6 గంటలకు గ్రామ ప్రభలు, 17వ తేదీన ఉదయం 8 గంటల నుండి బోనాల సమర్పణతో జాతర ముగుస్తుందని తెలిపారు. తిరుపతమ్మ తల్లి జాతరకు భక్తజనం అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా కోరారు.