ఖమ్మం, ఫిబ్రవరి 3 : స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్ ఇవ్వాలని బీసీ సంఘం సీనియర్ నాయకుడు గుండాల కృష్ణ డిమాండ్ చేశారు. సోమవారం ఖమ్మం నగరంలోని తన క్యాంపు కార్యాలయంలో జరిగిన బీసీ కులస్తుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇటీవల ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగిన కులగణనలో బీసీలు 56శాతం పైగా ఉన్నారని, గతంలో మాట ఇచ్చిన ప్రకారం 42శాతం రిజర్వేషన్ ఇచ్చి ఎన్నికలు జరపాలని కోరారు. అనంతరం కూరాకుల నాగభూషణం మాట్లాడుతూ ఈ సమాజంలో ఇంకా బీసీల పట్ల వివక్ష కొనసాగుతున్నదని, కులగణన, కులాల నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్ ఇవ్వాలని కోరారు.
బొమ్మా రాజేశ్వరరావు మాట్లాడుతూ బీసీల పట్ల చిన్నచూపు తగదని, అన్ని పార్టీలు బీసీలకు సముచిత స్థానం కల్పించాలని కోరారు. బీసీ నాయకులు కత్తి నెహ్రూ మాట్లాడుతూ 13శాతం ఉన్న అగ్ర కులాల్లో ఆర్థికంగా వెనకబడిన వారికి 10శాతం రిజర్వేషన్ ఇవ్వడం దారుణమని, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్‌ను తొలగించాలని కోరారు. కూరపాటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఖమ్మంలో బీసీ గర్జన దిశగా అన్ని బీసీ సంఘాలను సంసిద్ధత చేయాలని కోరారు. అనంతరం నాయకులందరూ అన్ని పార్టీలను కుల సంఘాలను పిలిచి 42శాతం రిజర్వేషన్ సాధించేందుకు విస్తృతస్థాయిలో రౌండ్‌టేబుల్ సమావేశం జరపాలని, అనంతరం వివిధ కుల సంఘాలతో సమావేశం జరపాలని నిర్ణయించారు.