– గూడు చెదరడంతో నాలుగేళ్లుగా దూరం
– చింతపల్లిలో సైబీరియా కొంగలను బెదరగొడుతున్న వానరాలు
– పర్యాటక ప్రాంతంగా గుర్తించినా కోతులను నివారించని అధికారులు
– ఈ ఏడాది మళ్లీ వచ్చిన ఫైలట్ కొంగలు
– ఈ సారైనా పూర్తిస్థాయిలో వస్తాయోమో అని ఎదురుచూపు
– నాలుగేళ్లుగా రాకపోవడంతో పంటలు సరిగా పండడం లేదన్న గ్రామస్తులు
ఖమ్మం రూరల్, జనవరి 24 : ఖమ్మం రూరల్ మండల పరిధిలోని చింతపల్లి అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది సైబీరియా కొంగలు. వాటినే చింతపల్లి చుట్టాలు అంటారు. ఎన్నో ఏళ్లుగా ఆ గ్రామానికి ప్రతీ ఏడాది డిసెంబర్ చివరి వారంలో కొన్ని పైలట్ కొంగలు వచ్చి అక్కడ వాతావరణాన్ని పరిశీలించి తిరిగి తమ దేశానికి వెళ్లి కొన్ని వందల సంఖ్యలో జనవరి మాసంలో వచ్చి ఆరు నెలల పాటు అంటే జూన్ వరకూ ఉండి తమ సంతతిని పెంచుకుని తిరిగి వెళ్లేవి. ఆ కొంగలు వచ్చినప్పటి నుండి తమ గ్రామంలో పంటలు బాగా పండుతున్నాయని గ్రామస్తుల నమ్మకం. గ్రామంలో ఎక్కువగా చింతచెట్లు ఉండడంతో కొంగలకు ఆవాసాలుగా గూడులు చేసుకుని చుట్టు పక్కల గ్రామాల్లోని చెరువుల్లో చేపలను ఆహారంగా తీసుకుంటుంటాయి. అలా చెట్టు నిండుగా కొంగలు.. కిల కిలా రాగాలు.. బారెడంత ముక్కు.. ఎరుపు, తెలుపు రంగులో చూడముచ్చటగా చూపరులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. అటువంటి వాటిని ఆ గ్రామస్తులు సొంత పిల్లల్లా కాపాడుకుంటారు. ఎవరైనా వాటిని చంపాలని చూస్తే వారిని పట్టుకుని దండగ వేయడం, దేహశుద్ధి చేయడం చేసేవారు. అంతగా ప్రేమగా చూసుకునే ఆ కొంగలు గత నాలుగేళ్లుగా ముఖం చాటేశాయి. అందుకు కారణం ఆ గ్రామం నిండా కోతులు ఎక్కువ కావడమే.
ఎన్నో వేల మైళ్ల నుండి ప్రయాణం చేసి తమకు అనుకూలంగా ఉన్న వాతావరణం వద్ద పలు రకాల చెట్లపై పుల్ల పుల్ల తెచ్చి గూడు కట్టుకుని అందులో నివాసం ఉంటాయి సైబీరియన్ కొంగలు. అటువంటి గూడులను కోతలు చెదరగొట్టి వాటికి ఆవాసం లేకుండా చేస్తున్నాయి. అంతే కాకుండా అవి పిల్లల సంతానం కోసం పెట్టే గుడ్లను పగులకొట్టి తినడం, ధ్వంసం చేయడంతో కొంగలు ఆ గ్రామానికి రావడం మానేశాయి. 50 ఏళ్లకు పైగా ఆ గ్రామంతో ఉన్న అనుబంధాన్ని వదులుకోక తిరిగి 4 ఏళ్ల తర్వాత ఈ ఏడాది గ్రామానికి వచ్చాయి.
రాష్ట్రంలో ఎక్కడా కనిపించని అతి పెద్ద కొంగలు.. పెద్ద ముక్కు, ఎతైన కాళ్లు చూడగానే ప్రకృతి ప్రేమికులను ఆకట్టుకునే పక్షులు చింతపల్లికి ఎన్నో ఏళ్లుగా వస్తున్నాయి. దీంతో ఆ గ్రామానికి కొంగలను చూసేందుకు జనవరి నుండి జూన్ వరకు ఎంతో మంది పర్యాటకులు వస్తుంటారు. ఆ కొంగలను చూసి ఆచర్యకితులు అవుతారు. కొంగలు పక్కన ఉన్నట్లు వాటితో ఫొటోలు దిగుతారు. ఇలా పర్యాటకులు ఏడాదికి ఏడాది పెరగడంతో ప్రభుత్వం చింతపల్లి గ్రామాన్ని పర్యాటక కేంద్రంగా ప్రకటించింది. కానీ ఆ దిశగా అభివృద్ధి మాత్రం చేపట్టకపోవడం, కోతుల నివారణకు చర్యలు తీసుకోక పోవడంతో కొంగలు గ్రామానికి రావడం మానేశాయి.
ఐదేండ్ల తర్వాత ఈ ఏడాది గ్రామానికి సైబీరియా నుండి వచ్చిన కొంగలు చివరి వరకూ ఉంటాయా? కోతుల బెడదతో మద్యలోనే వెళ్తాయా అనే ఆందోళన గ్రామస్తుల్లో మొదలైంది. కోతులతో ప్రజలే తట్టుకోలేక పోతున్నారు. ఇండ్లలో ఉన్న తినే పదార్థాలను ఆగం చేయడమే కాకుండా మనుషులపై సైతం దాడి చేస్తున్నాయి. అయినా ఈ విషయం తీవ్రత అధికారులకు తెలిపినా ఎవరూ స్పందించడం లేదని వాపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం చింతపల్లి గ్రామంలో ఉన్న కోతులను నివారించి కొంగలకు రక్షణ కల్పించాలని, అలాగే కొంగలకు ఆహారం కోసం చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

Khammam Rural : ‘అతిథులకు’ కోతుల బెడద