ఖమ్మం రూరల్, ఏప్రిల్ 12 : పద్మశ్రీ అవార్డు గ్రహీత, వనజీవి రామయ్య ఆకస్మిక మృతి అత్యంత బాధాకరమని పాలేరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి అన్నారు. రామయ్య మృతి వార్త తెలుసుకున్న కందాల పార్టీ నాయకులతో కలిసి హుటాహుటిన ఖమ్మం రూరల్ మండలం రెడ్డిపల్లి గ్రామంలోని రామయ్య ఇంటికి వెళ్లి ఆయన భౌతికకాయాన్ని సందర్శించారు. మృతదేహంపై పుష్పగుచ్చాలు ఉంచి ఘనంగా నివాళులర్పించారు. రామయ్య కుటుంబ సభ్యులకు ఆయన తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తన తుది శ్వాస వరకు వృక్ష సంపదను పెంపొందించేందుకు కృషి చేసిన గొప్ప వ్యక్తి రామయ్య అని కొనియాడారు.
నేటి యువత రామయ్య జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకుని మొక్కల పెంపకానికి కృషి చేయాలని కోరారు. మొక్కల పెంపకానికి మనం చేసే కృషే రామయ్యకు అందించే ఘన నివాళి అన్నారు. నివాళులర్పించిన వారిలో రూరల్ మండలం బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు బెల్లం వేణుగోపాల్, మాజీ జడ్పీటీసీ ఎండపల్లి వరప్రసాద్, సొసైటీ చైర్మన్లు బిరెడ్డి నాగచంద్రారెడ్డి, సిపిఎం మండల కార్యదర్శి సుదర్శన్ రెడ్డి, సిపిఐ జాతీయ నాయకులు భాగం హేమంతరావు, సామాజిక కార్యకర్తలు అన్నం శ్రీనివాసరావు, కడవెంటి వేణుగోపాల్ ఉన్నారు.
వైరా : కోటి మొక్కలు నాటి దేశాన్ని హరిత దేశంగా తయారు చేసేందుకు తన వంతు కృషిచేసిన వనజీవి రామయ్య ఆకస్మిక మరణం తీరని లోటు అని వైరా మాజీ శాసనసభ్యురాలు డాక్టర్ బానోత్ చంద్రావతి అన్నారు. ప్రభుత్వ మార్చురీలో రామయ్య మృతదేహాన్ని సందర్శించి భౌతికకాయంపై పూలమాల వేసి నివాళులర్పించారు.