కొత్తగూడెం ఎడ్యుకేషన్/పాల్వంచ/ మామిళ్లగూడెం/ కొత్తగూడెం క్రైం, జూన్ 11: టీఎస్పీఎస్సీ ఆధ్వర్యంలో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఆదివారం నిర్వహించిన గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. రెండు జిల్లాల్లోని 72 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించగా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉదయం 8 గంటల నుంచే పరీక్ష కేంద్రాలకు చేరుకున్న అభ్యర్థులను రెండు విడుతలుగా తనిఖీ చేసి లోపలికి అనుమతించారు. ఖమ్మం జిల్లాలోని 50 కేంద్రాల్లో 17,365 మందికి.. 10,945 మంది అభ్యర్థులు పరీక్షలు రాయగా.. 6,420 మంది గైర్హాజరయ్యారని కలెక్టర్ వీపీ గౌతమ్ తెలిపారు. విధి నిర్వహణలో భాగంగా కేంద్రం వద్ద పోలీసులు కలెక్టర్‌ను కూడా తనిఖీ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని 22 కేంద్రాల్లో 8,851 మందికి.. 5,258 మంది పరీక్షలు రాయగా.. 3,593 మంది గైర్హాజరయ్యారు. ఖమ్మంలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల, ఆర్జేసీ కళాశాల, రిక్కాబజార్ ఉన్నత పాఠశాల, కవిత మెమోరియర్ కళాశాల, ఎస్‌ఆర్‌అండ్‌బీజీఎన్‌ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లోని కేంద్రాలను కలెక్టర్‌తోపాటు పలువురు ఉన్నతాధికారులు పరిశీలించారు.
పరీక్ష నిర్వహణ ప్రక్రియను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. కలెక్టర్ తనిఖీల సందర్భంగా శిక్షణ కలెక్టర్ మయాంక్ సింగ్, ఆర్డీవోలు రవీంద్రనాథ్, సూర్యనారాయణ, ఏసీపీ రామోజీ రమేశ్, ప్రిన్సిపాళ్లు పద్మావతి, అరుణ్‌కుమార్ ఆయన వెంట ఉన్నారు. ఖమ్మం సీసీ విష్ణు ఎస్ వారియర్ పరీక్ష కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన బందోబస్తును,144 సెక్షన్ అమలును పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. తనిఖీల్లో శిక్షణ ఐపీఎస్ అవినాశ్ కుమార్ పాల్గొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ వినీత్ పలు కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసి.. బందోబస్తును పర్యవేక్షించారు. కొత్తగూడెంలోని మహిళా డిగ్రీ కాలేజీ కేంద్రాన్ని తనిఖీ చేసేందుకు రావడంతో పోలీస్ సిబ్బంది ఎస్పీని కూడా తనిఖీ చేసి కేంద్రంలోకి అనుమతించారు. సిబ్బందిని ఎస్పీ అభినందించారు. వేసవి ఎండల తీవ్రత దృష్ట్యా పరీక్షా కేంద్రాల వద్ద అభ్యర్థుల కోసం తాగునీటిని ఏర్పాటు చేశారు. పరీక్షా కేంద్రాలకు వంద మీటర్ల లోపు ఉన్న అన్ని జిరాక్స్ సెంటర్లు, నెట్ సెంటర్లను మూసి వేయించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భద్రాచలం ఏఎస్పీ పంకజ్ పరితోష్, కొత్తగూడెం డీఎస్పీ అబ్దుల్ రెహమాన్, పాల్వంచ డీఎస్పీ ఎన్.వెంకటేశ్ బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షించారు.