కొత్తగూడెం అర్బన్, ఫిబ్రవరి 9 : భద్రాద్రి జిల్లాలో సురక్షిత స్థాయిలోనే భూగర్భజలాలు స్థిరంగా ఉన్నాయి. గడిచిన పదేళ్లుగా భూగర్భజలాలు సురక్షితస్థాయిలో ఉంటున్నాయి. జిల్లాలోని 17 మండలాల్లో అనుకున్నస్థాయిని మించి వర్షపాతం 20 శాతం ఎక్కువగా నమోదు కాగా.., 6 మండలాల్లో 19 శాతంలోపు అత్యధికంగా నమోదైంది. రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో చెక్‌డ్యాంల నిర్మాణం, మిషన్ కాకతీయలో చెరువుల పునరుద్ధరణ, ఇంకుడు గుంతల నిర్మాణంపై విస్తృతంగా ప్రచారం చేయడంతోపాటు భూగర్భ జలాలను కాపాడేకునేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అన్నీ మండలాధికారులు వివరిస్తూ ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. దీంతో జల వినియోగంతోపాటు వాటిని పొదుపుగా వాడుకోవడం, ఉపయోగించిన నీటిని ఇంకుడుగుంతల నిర్మాణంతో మళ్లీ భూమిలో ఇంకేవిధంగా పనులు చేపట్టడంతో భూగర్భజలం స్థిరంగా ఉన్నాయి.
పది మీటర్లలోపే భూగర్భజలం
జిల్లాలో పది మీటర్లలోపే భూగర్భ జలమట్టం ఉందని అధికారులు చెబుతున్నారు. జిల్లాలోని 62 చోట్ల భూగర్భజలాన్ని కొలిచే ఫీజోమీటర్లను ఏర్పాటు చేశారు. వీటి ఆధారంగా ఈ నీటిమట్టాన్ని సులువుగా కొలుస్తున్నారు. ఏడాదిగా జలమట్టం స్థిరంగా కొనసాగుతూనే ఉంది. సరాసరి నీటిమట్టం గతేడాది జనవరిలో 6.78 మీటర్లు కాగా, ప్రస్తుత జనవరిలో 7.49 మీటర్లుగా ఉంది. 23 మండలాలు ఉండగా.. 17మండలాల్లో 10మీటర్లలోపు నీటిమట్టం ఉంది. ఎక్కువగా జలాలను వినియోగించే దమ్మపేట మండలంలో 39.16 మీటర్లు, అశ్వారావుపేటలో 31.7 మీటర్లు, చండ్రుగొండలో 21.38 మీటర్లు, కొత్తగూడెంలో 22.73 మీటర్లలోపు జలం లభ్యమవుతున్నది.
దమ్మపేట మండలంలో ఎక్కువ వినియోగం
దమ్మపేట మండలంలో అధికారుల లెక్కల ప్రకారం భూగర్భ జలాలను అత్యధికంగా వినియోగించుకుంటున్నారు. అత్యాధునిక వ్యవసాయ పద్ధతులను అవలంబించడం, బోర్లకు నూతన టెక్నాలజీతో కేసీంగ్లు వేయడం వల్ల భూగర్భజలాన్ని ఎక్కువగా వాడుకుంటున్నట్లు తేలింది. ఆ ప్రాంతంలో నేల స్వభావం (మెతకరాయి) కూడా నీరునిల్వ ఉండకపోవడానికి ఒక కారణంగా చెబుతున్నారు. 100హెక్టా మీటర్ల కంటే ఎక్కువగా నీటిని ఉపయోగిస్తే దాన్ని డేంజర్ జోన్‌గా నిర్ణయిస్తారు. ఇక్కడ భూగర్భ జలాలను వినియోగించడంలో ముందు వరుసలో ఉంది. చెక్డ్యాంలతోనే నీటిని నిల్వ చేసుకొని వినియోగించుకోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో ఇతర జిల్లాలతో పోలిస్తే భూగర్భ జలాల పరిరక్షణలో మెరుగైన స్థానంలోనే భద్రాద్రి జిల్లా ఉందని భూగర్భజలశాఖాధికారులు చెబుతున్నారు.
భూగర్భజలం స్థిరంగా ఉంది
జిల్లాలో భూగర్భజలం స్థిరంగా ఉంది. పది మీటర్లలోపే దాదాపుగా జలం లభ్యమవుతున్నది. జిల్లాలో నీటి వనరులకు ఎలాంటి ఇబ్బందులు లేవు. 25 శాతం మాత్రమే జిల్లావాసులు భూగర్భజలాన్ని వినియోగించుకుంటున్నారు. ఒక దమ్మపేట మండలంలోనే అత్యధికంగా ఈ భూగర్భజలాలను వినియోగించుకుంటున్నారు. భవిష్యత్‌లో తాగు, సాగునీటి, వివిధ పరిశ్రమల వినియోగానికి సరిపడా నీటికి కొరత లేకుండా చర్యలు తీసుకున్నాం. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘మిషన్ కాకతీయ’ ఇంకుడుగుంతల నిర్మాణంపై ప్రచారం కల్పిస్తూ ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు.
-ఎం బాలు, జిల్లా భూగర్భజలశాఖాధికారి