కొత్తగూడెం అర్బన్, మే 19: క్రీడామైదానాల్లో క్రీడల సందడి నెలకొంది. సమ్మర్ క్యాంప్‌లకు మంచి స్పందన లభిస్తున్నది. తల్లిదండ్రుల అభిరుచులూ మారుతున్నాయి. పిల్లలు కూడా క్రీడలు నేర్చుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. దీంతో పిల్లలతో క్రీడా మైదానాలు కిక్కిరిసిపోతున్నాయి. క్రీడలు నేర్చుకోవాలనే ఉత్సాహం ఉన్న పిల్లలను తల్లిదండ్రులు, పెద్దలు క్యాంప్‌లకు తీసుకొస్తున్నారు. సమ్మర్ క్యాంప్‌లకు సుమారు 500 మంది పిల్లలు వస్తున్నారు. క్యాంప్‌లు ఈ నెల 1న ప్రారంభమయ్యాయి. 31 వరకు కొనసాగనున్నాయి. ఉదయం 6 నుంచి 8 గంటల వరకు, సాయంత్రం 5 నుంచి 7 గంటల వరకు పిల్లలు క్యాంప్‌లకు వస్తున్నారు. కోచ్‌ల పర్యవేక్షణలో ఉత్సాహంగా క్రీడా సాధన చేస్తున్నారు. పిల్లలు ఎక్కువగా క్రికెట్, వాలీబాల్, బాస్కెట్‌బాల్, అథ్లెటిక్స్ నేర్చుకుంటున్నారు.
వేసవి సెలవులు వచ్చాయంటే పిల్లలకు పండగే పండగ.. అమ్మమ్మ. నానమ్మ ఇంటికి వెళ్లొచ్చు.. ఎంచక్కా తల్లిదండ్రులతో కలిసి విహార యాత్రలు, తీర్థయాత్రలకు వెళ్లొచ్చు.. ఇంటి దగ్గర తోటి స్నేహితులతో ఆడుకోవచ్చు.. ఇలా ఒకటేంటి ఇంకా ఎన్నో చేయొచ్చు.. ఇంకొందరు చిచ్చర పిడుగులు అయితే సమ్మర్ స్పోర్ట్స్ క్యాంప్స్ను ఎంచుకుంటున్నారు. ప్రస్తుత సమాజంలో కొత్త ట్రెండ్ కనిపిస్తున్నది. అదే స్పోర్ట్స్ ట్రెండ్. గతంలో కంటే ఇప్పుడు స్పోర్ట్స్ సాధన చేస్తున్న వారి సంఖ్య నానాటికీ పెరుగుతున్నది. తల్లిదండ్రుల అభిరుచులూ మారుతున్నాయి. పిల్లలు కూడా క్రీడలు నేర్చుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. క్రికెట్, వాలీబాల్, బాస్కెట్‌బాల్, అథ్లెటిక్స్ నేర్చుకుంటున్నారు. ఇదే కోవలో కొత్తగూడెంలోని ప్రగతి మైదాన్‌లో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఉచిత సమ్మర్ క్యాంప్‌లకు మంచి స్పందన లభిస్తున్నది. క్రీడలు నేర్చుకోవాలనే ఉత్సాహం ఉన్న పిల్లలను తల్లిదండ్రులు, పెద్దలు క్యాంప్‌లకు తీసుకొస్తున్నారు. సమ్మర్ క్యాంప్‌లకు సుమారు 500 మంది పిల్లలు వస్తున్నారు.
వివిధ క్రీడల్లో కోచింగ్
ప్రగతి మైదాన్‌లో ప్రస్తుతం వాలీబాల్, బాస్కెట్‌బాల్, కబడ్డీ, ఫుట్‌బాల్, అథ్లెటిక్స్‌లో సమ్మర్ క్యాంప్‌లు నడుస్తున్నాయి. నిష్ణాతులైన కోచ్‌లు, క్రీడాకారులు పిల్లలకు నాణ్యమైన కోచింగ్ ఇస్తున్నారు. క్యాంప్‌లు ఈ నెల 1న ప్రారంభమయ్యాయి. 31 వరకు కొనసాగనున్నాయి. ఉదయం 6 నుంచి 8 గంటల వరకు, సాయంత్రం 5 నుంచి 7 గంటల వరకు పిల్లలు క్యాంప్‌లకు వస్తున్నారు. కోచ్‌ల పర్యవేక్షణలో ఉత్సాహంగా క్రీడా సాధన చేస్తున్నారు. కోచ్‌లు పిల్లలకు ఆసక్తి ఉన్న క్రీడలు నేర్పిస్తున్నారు.
సందడిగా ప్రగతిమైదాన్
సమ్మర్ క్యాంప్‌లతో ఉదయం, సాయంత్రం ప్రగతి మైదాన్ పిల్లలతో సందడిగా కనిపిస్తున్నది. పిల్లలతో పాటు వారిని మైదానానికి తీసుకొచ్చే పెద్దలు, వృద్ధులతో కళకళలాడుతున్నది. శిక్షకులు వివిధ క్రీడల్లో నాణ్యమైన శిక్షణ ఇస్తున్నారు. పిల్లలు ఉత్సాహంగా క్రీడలు నేర్చుకుంటుండడంతో తల్లిదండ్రులు మురిసిపోతున్నారు. క్రీడలు నేర్చుకుంటున్న పిల్లలకు క్రమశిక్షణ అలవడుతున్నదని, వారిలో గతంలో కంటే ఎక్కువ ఉత్సాహం కనిపిస్తున్నదని తల్లిదండ్రులు చెప్తున్నారు. వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతున్నదంటున్నారు.
బాస్కెట్‌బాల్‌లో శిక్షణ తీసుకుంటున్నా..
నేను తొమ్మిదో తరగతి చదువుతున్నాను. నాకు బాస్కెట్‌బాల్ అంటే ఇష్టం. నేను సమ్మర్ క్యాంప్‌లో బాస్కెట్ బాల్లో శిక్షణ తీసుకుంటున్నాను. కోచ్ మంచిగా నేర్పిస్తున్నారు. నాతోపాటు ఎంతోమంది క్యాంప్‌లో శిక్షణ పొందుతున్నారు.
– కిరణ్మయి, బూడిదగడ్డ
క్రీడలతో క్రమశిక్షణ..
క్రీడలతో క్రమశిక్షణ అలవడుతుంది. విద్యార్థులకు చదువు ముఖ్యమే. ఆటలూ ముఖ్యమే. ప్రస్తుతం పిల్లలంతా స్కూల్ అయిపోగానే సెల్ఫోన్లు తీసుకుని వీడియో గేమ్స్ ఆడుతున్నారు. యూట్యూబ్ చూస్తున్నారు. దాని కంటే సమ్మర్ స్పోర్ట్స్ క్యాంప్‌లకు పంపడం ఉత్తమం. క్రీడలతో పిల్లలకు క్రమశిక్షణ అలవడుతుంది.
– శంకర్, విద్యార్థి తండ్రి, కొత్తగూడెం
మంచి కోచింగ్ ఇస్తున్నాం..
నేను చిన్నారులకు అథ్లెటిక్స్‌లో శిక్షణ ఇస్తున్నా. వారితో ఎక్సర్సైజు చేయిస్తున్నా. గేమ్ రూల్స్‌పై అవగాహన కల్పిస్తున్నా. పిల్లలకు ఆసక్తి ఉన్న ఆటలనే నేర్పిస్తున్నాం. నేను 50 మంది పిల్లలకు శిక్షణ ఇస్తున్నాను. అందరూ చక్కగా నేర్చుకుంటున్నారు.
– పుష్ప, కోచ్, కొత్తగూడెం
తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే..
నేను నాలుగో తరగతి చదువుతున్నాను. వేసవి సెలవుల్లో సమ్మర్ క్యాంప్‌నకు వస్తున్నాను. శిక్షకులు మాకు ఆసక్తి ఉన్న క్రీడల్లో శిక్షణ ఇస్తున్నారు. మేం చక్కగా క్రీడలు నేర్చుకుంటున్నాం. మున్ముందు క్రీడాపోటీల్లో పాల్గొంటాను. జిల్లాకు మంచి పేరు తీసుకొస్తాను. నన్ను తల్లిదండ్రులు ఎంతగానో ప్రోత్సహిస్తున్నారు.
– భరత్ తేజ, గాజులరాజం బస్తీ, కొత్తగూడెం