మామిళ్లగూడెం, జూలై 16: ముద్దుగా పెంచుకున్న మనవడే ఆ ముసలమ్మకు మరణ శాసనం రాశాడు. జీవిత చరమాంకంలోనూ విశ్రాంతి తీసుకోకుండా, కొడుకు వద్దకు వెళ్లి ప్రశాంత జీవనం గడపకుండా.. మనవడిపైనే మమకారం చూపిస్తూ అతడినే తన వద్ద ఉంచుకొని కాలం వెళ్లదీస్తున్న ఆ అమ్మమ్మను చివరికి అతడే అంతమొందించాడు. ‘మద్యానికి డబ్బులడిగితే లేవంటావా?’ అంటూ అల్లారుముద్దుగా పెంచిన అమ్మమ్మను అక్కడికక్కడే అంతం చేశాడు. ఈ హృదయ విదారక ఘటన ఖమ్మం జిల్లా కేంద్రంలో సోమవారం రాత్రి చోటుచేసుకోగా.. మంగళవారం ఉదయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. ఖమ్మం రోటరీనగర్‌కు చెందిన అమరబోయిన రాంబాయమ్మ (80), విశ్వనాథం దంపతులకు ఇద్దరు కొడుకులు, ముగ్గురు కుమార్తెలు. ఉపాధి నిమిత్తం కొడుకులు వేర్వేరు ప్రాంతాల్లో నివాసం ఉంటున్నారు. కుమార్తెలకు వివాహాలై వారిళ్లకు వెళ్లిపోయారు. భర్త విశ్వనాథం కూడా ఇప్పటికే మృతిచెందడంతో ఆమె ఇక్కడ ఒంటరిగానే ఉంటోంది. చిన్న కుమార్తె వసంత కుమారుడు ఉదయ్‌కుమార్‌ను తనతోనే ఉంచుకుంటోంది. ఆమె కుమారుల్లో ఒకరైన గురవయ్య హైదరాబాద్‌లో ప్రైవేటు లెక్చరర్‌గా పనిచేస్తున్నాడు. వృద్ధాప్యంలో ఖమ్మంలో ఉంటూ ఇబ్బంది పడవద్దని, హైదరాబాద్ వచ్చి తన వద్ద ఉండాలని అతడు కోరినా ఆమె వెళ్లలేదు. మనవడిపై మమకారం, ఇరుగూపొరుగుతో అనుబంధం పెంచుకున్న ఆమె.. తన కుమారుడి వద్దకు వెళ్లేందుకు ఇష్టపడలేదు. ఆ కొడుకు పంపించే భత్యం, ప్రభుత్వం నుంచి వచ్చే ఆసరా పింఛన్‌తోనే బతుకును వెళ్లదీస్తోంది.
చిన్న కుమార్తెకు వేరే వివాహం చేయడంతో ఆమె కుమారుడైన ఉదయ్‌కుమార్‌ను ఈ వృద్ధురాలే పెంచి పెద్దచేసింది. అమ్మమ్మ వద్దే పెరుగుతున్న అతడు.. పదో తరగతిలో ఉన్నత శ్రేణిలో ఉత్తీర్ణుడయ్యాడు. ఆ తరువాత జులాయిగా మారి మద్యం, గంజాయి, గుట్కా వంటి చెడు వ్యసనాలకు, జల్సాలకు అలవాటు పడ్డాడు. డిప్లొమా కోర్సును కూడా మధ్యలోనే వదిలేశాడు. గుట్కాలు, మద్యం, గంజాయికి బానిసయ్యాడు. డబ్బు కోసం అమ్మమ్మను తరచూ వేధించేవాడు. ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి కూడా తన జల్సాలకు అవసరమైన రూ.3 వేలు ఇవ్వాలని అమ్మమ్మపై ఒత్తిడి చేశాడు. తన వద్ద లేవని ఆమె చెప్పడంతో మద్యం మత్తులో ఉన్న ఉదయ్‌కుమార్ ఆగ్రహంతో ఊగిపోయాడు. ఆమెపై దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన ఆమె అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. మంగళవారం ఉదయం వేళ ఇంట్లో వృద్ధురాలి అలికిడి లేకపోవడంతో ఇరుగూపొరుగు వారు ఇంట్లోకి వెళ్లి చూశారు. అప్పటికే ఆమె మృతిచెంది ఉండడాన్ని గమనించి ఉదయ్‌కుమార్‌ను ప్రశ్నించారు. అయితే ఇంట్లో జారి పడిందని అతడు నమ్మించే ప్రయత్నం చేశాడు. ఇంట్లోని వాతావరణం, అతడి ప్రవర్తన వారికి అనుమానాన్ని కలిగించాయి. దీంతో వారు గట్టిగా నిలదీయడంతో అసలు విషయాన్ని చెప్పాడు. దీంతో ఆగ్రహించిన స్థానికులు.. దేహశుద్ధి చేసి ఖమ్మం టూటౌన్ పోలీసులకు అప్పగించారు. అన్నం సేవా ఫౌండేషన్ అధినేత అన్నం శ్రీనివాసరావు బృందం సహకారంతో వృద్ధురాలి మృతదేహాన్ని జిల్లా ఆసుపత్రి మార్చురీకి తరలించారు. కుమారుడు గురవయ్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఖమ్మం టూటౌన్ సీఐ బాలకృష్ణ తెలిపారు.