భద్రాచలం, మార్చి 9: రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాల ప్రజలూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాతా మధు మండిపడ్డారు. చివరికి సొంత పార్టీ ఎమ్మెల్యేలే ముఖ్యమంత్రి పేరును మర్చిపోతున్నారని ఎద్దేవా చేశారు. భద్రాచలంలోని బీఆర్ఎస్ నాయకుడు రావులపల్లి రాంప్రసాద్ నివాసంలో ఆదివారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంట్రాక్టర్ల కమీషన్లు, ఇసుక దందాలే కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుగా మారాయని ఆరోపించారు. రాష్ట్రంలోని ఏ గ్రామంలో కూడా 30 శాతానికి పైగా రుణమాఫీ కాలేదన్నారు.
కాంగ్రెస్ వస్తే కష్టాలు వచ్చినట్లేనని ప్రజలు అనుకుంటున్నారని అన్నారు. ఇప్పటికే పల్లెల్లో గత కాంగ్రెస్ పాలనలోని రోజులు మళ్లీ కన్పిస్తున్నాయని అన్నారు. యూరియా బస్తాల కోసం చెప్పులు లైన్లో పెట్టి నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పాలనలో గోదావరి పరివాహక ప్రాంతంలో ఇసుక వ్యాపారం ‘మూడు పువ్వులు – ఆరు కాయలు’ అన్నట్లుగా సాగుతోందని విమర్శించారు. రాష్ట్ర సచివాలయం ఎదుట కాంట్రాక్టర్లు కూడా ఆందోళన చేపట్టారంటే రాష్ట్ర పరువును కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా నడిబజారులో నిలబట్టిందో ప్రజలు అర్థం చేసుకుంటున్నారని అన్నారు.
చివరికి తాగునీరు, సాగునీరు కూడా కాంగ్రెస్ ఇవ్వలేకపోతోందని ధ్వజమెత్తారు. ప్రజల కష్టాలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు బీఆర్ఎస్ నిరంతరం పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ రజతోత్సం నేపథ్యంలో ఏప్రిల్ 27న లక్షలాది మంది మధ్య వరంగల్‌లో నిర్వహించనున్న బహిరంగ సభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ నాయకులు రావులపల్లి రాంప్రసాద్, మానే రామకృష్ణ, ఆకోజు సునీల్‌కుమార్, రేపాక పూర్ణచందర్రావు, కొల్లం జయప్రేమ్కుమార్, తుమ్మలపల్లి ధనేశ్వరరావు, అయినాల రామకృష్ణ, గోజుల వెంకటశ్రీనివాస్, చిట్టిమళ్ల అనిల్, పూజల లక్ష్మి, ప్రియాంక పాల్గొన్నారు.