
ఖమ్మం, డిసెంబర్ 21 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): స్వయం సహాయక సంఘాల పని తీరుపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. రుణాలు అందించే సమయంలో ఆయా సంఘాల పనితీరును పరిగణనలోకి తీసుకోవాలని నిర్ణయించింది. అందులో భాగంగా స్వయం సహాయక సంఘాల పని తీరును నాలుగు గ్రేడ్లుగా విభజించింది. గ్రేడ్ల ప్రాతిపదికన రుణాలను అందించనున్నది. ఈ విధానం వచ్చే ఆర్థిక సంవత్సరం (2022 మార్చి) నుంచి అమల్లోకి రానున్నది. నాలుగు గ్రేడ్లలో ఏదో ఒక గ్రేడ్‌లో ఆయా సంఘాలు ఉంటేనే వారికి రుణాలు అందనున్నాయి. అయితే, ఖమ్మం జిల్లాలోని 20 మండలాల్లో ఇప్పటికే గ్రేడింగ్ ప్రక్రియ పూర్తయింది. కల్లూరు మండలంలోని స్వయం సహాయక సంఘాలకు అత్యధికంగా ఏ గ్రేడ్ లభించింది. మండలంలో 1,587 స్వయం సహాయక సంఘాలున్నాయి. 1,326 సంఘాలకు ఏ గ్రేడ్ లభించింది. ఖమ్మం రూరల్ మండలంలో 1,674 స్వయం సహాయక సంఘాలు ఉండగా.. 1,164 సంఘాలకు ఏ గ్రేడ్ లభించింది.
ఇక నుంచి జిల్లాలోని అన్ని స్వయం సహాయక సంఘాలకు గ్రేడింగ్ విధానం అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మహిళా సంఘాలు ఇప్పటివరకు ఆర్థికాభివృద్ధి సాధించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ రూపాల్లో బ్యాంకు రుణాలిస్తూ ప్రోత్సహించాయి. బ్యాంకు రుణ సాయంతో మహిళలు వివిధ రంగాల్లో స్వయం ఉపాధి పొందడంతోపాటు పది మందికి ఉపాధి కల్పించే స్థాయికి చేరుకున్నారు. స్వయం సహాయక సంఘాలకు వెన్నుదన్నుగా ఉన్న జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ వారికి కావాల్సిన సదుపాయాలను, సహకారాన్ని అందిస్తూ వచ్చింది. మ హిళా సంఘాలకు బ్యాంకు లింకేజీ, స్త్రీనిధి ద్వారా ఏటా పెద్దఎత్తున రుణాలు అందిస్తున్నారు. కొన్ని సంఘాలు సక్రమంగా సమావేశాలు నిర్వహించకపోయినా రుణ చెల్లింపుల్లో ఆలస్యం చేసినా డీఆర్డీఏ పరిధిలోని అధికారులు చొరవ తీసుకుని రుణ చెల్లింపులు చేస్తూ మహిళల స్వయం ఉపాధికి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకుంటున్నారు. పూర్తిగా పనితీరును మెరుగు పర్చుకొని స్వయం సహాయక సంఘాలను, రుణాలు చెల్లింపుపై నిర్లక్ష్యం ప్రదర్శించే సంఘాల పనితీరును పరిగణనలోకి తీసుకోనున్నారు.
12 అంశాల ఆధారంగా….
సంఘాల పనితీరును బట్టి గ్రేడింగ్ ఇవ్వనున్నది. రుణాల చెల్లింపులు, వాటిని సద్వినియోగం చేసుకోవడం, నెలకు రెండుసార్లు విధిగా సమావేశం కా వడం, రికార్డుల నిర్వహణను బట్టి నాలుగు గ్రేడ్లు ఇవ్వనున్నారు. ఇందులో 12 అంశాలను పరిగణనలోకి తీసుకుని 75శాతానికిపైగా మార్కులు సా ధిస్తే ఏ గ్రేడ్, 70 నుంచి 75 శాతం లోపు వస్తే బి గ్రేడ్, 70లోపు వస్తే సీగ్రేడ్, 60శాతంలోపు మా ర్కులొస్తే డి గ్రేడ్ ఇవ్వనున్నారు. ఈ విధానం అమలుతో పూర్తి పనిసామర్థ్యాన్ని ప్రదర్శించే మహిళా సంఘాలకు ప్రయోజనం కలగనున్నది.
జిల్లాలో 25,138 సంఘాలు
జిల్లాలో 25,138 స్వయం సహాయక సంఘాలున్నాయి. 1,008 గ్రామసమాఖ్యలు ఉన్నాయి. ఇందులో 24,470 స్వయం సహాయక సంఘాలకు గ్రేడింగ్‌లు నిర్వహించారు. 668 స్వయం సహాయక సంఘాలకు గ్రేడింగ్ ఇవ్వలేదు. 20,745 స్వయం సహాయక సంఘాలకు పనితీరును బట్టి ఏగ్రేడ్ లభించగా.. 407 సంఘాలకు బి గ్రేడ్ లభించింది. 1,696 సంఘాలకు సీ గ్రేడ్, 1,622 సంఘాలకు డి గ్రేడ్ లభించింది. జిల్లాలోని 20 మండలాల్లో ఈ గ్రేడింగ్ ప్రక్రియ ఇప్పటికే పూర్తయింది. కల్లూరు మండలంలోని స్వయం సహాయ సంఘాలకు అత్యధికంగా ఏ గ్రేడ్ లభించింది. మండలంలో 1,587 స్వయం సహాయక సంఘాలుండగా.. అత్యధికంగా 1,326 స్వయం సహాయక సంఘాలకు ఏ గ్రేడ్ లభించింది. ఖమ్మం రూరల్ మండలంలో 1,674 స్వయం సహాయక సంఘాలు ఉం డగా.. 1,164 సంఘాలకు ఏ గ్రేడ్ లభించింది.
సంఘాలకు అవగాహన కల్పిస్తున్నాం
ప్రభుత్వ ఆదేశాల మేరకు స్వయం సహాయక సంఘాల పని తీరును ఇప్పటికే నిర్దేశించాం. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా జిల్లాలోని స్వయం సహాయక సంఘాలకు నాలుగు గ్రేడ్లుగా విభజించి పనితీరుపై ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నాం. ప్రభుత్వం ప్రామాణికంగా తీసుకున్న 12 అంశాలకు సంబంధించి స్వయం సహాయక సంఘాలు, గ్రామసమాఖ్యలకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పిస్తున్నాం. సమావేశాలను సకాలంలో నిర్వహించడం, రుణాలను ఎప్పటికప్పుడు చెల్లించడం వంటి పనులను త్వరితగతిన పూర్తిచేసేలా పర్యవేక్షిస్తున్నాం.
-విద్యాచందన, డీఆర్డీవో, ఖమ్మం