కారేపల్లి, జూలై 28 : గుండెపోటుతో మృతి చెందిన ఆటో డ్రైవర్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని అంబేద్కర్ సేన ఖమ్మం జిల్లా కన్వీనర్ పప్పుల నిర్మల డిమాండ్ చేశారు. ఖమ్మం జిల్లా సింగరేణి మండల కేంద్రంలో సోమవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. కారేపల్లి మండల పరిధిలోని పేరుపల్లి గ్రామానికి చెందిన తలారి నాని హైదరాబాద్లో రాపిడో ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అయితే ఆటోలకు సరైన కిరాయిలు లేకపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ కుటుంబం గడవలేని పరిస్థితికి చేరింది.
ఆర్థిక సమస్యతో సతమతమవుతున్న నాని మూడు రోజుల క్రింద ఆటో నడుపుతూనే గుండెపోటుకు గురై అక్కడికక్కడే మృతి చెందాడని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం మృతదేహాన్ని స్వగ్రామం తీసుకురాలేని పరిస్థితిలో ఆ కుటుంబం ఉందన్నారు. నానికి భార్య, ఇద్దరు ఆడపిల్లలు ఉన్నట్లు తెలిపారు. కాబట్టి నాని కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. ఆమె వెంట ఆ సంఘం నాయకురాలు సంగిశెట్టి నాగమణి ఉన్నారు.