మణుగూరు టౌన్, సెప్టెంబర్ 6: కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు నిరుపేద కుటుంబాల్లోని ఆడబిడ్డలకు వరంలాంటివని ప్రభుత్వ విప్ రేగా కాంతారావు పేర్కొన్నారు. అద్భుత పథకాలు అమలు చేస్తున్న సీఎం కేసీఆర్.. పేద కుటుంబాల్లో వెలుగులు నింపుతున్నారని అన్నారు. మండలంలోని 40 మంది లబ్ధిదారులకు మంజూరైన రూ.40 లక్షల విలువైన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను మణుగూరు తహసీల్దార్ కార్యాలయంలో బుధవారం జరిగిన కార్యక్రమంలో ఆయన పంపిణీ చేసి మాట్లాడారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో రాజకీయాలకు అతీతంగా అందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయని అన్నారు.
ఆడపిల్లలున్న తల్లిదండ్రులు వారి వివాహాలన జరిపించేందుకు ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా ఉండేందుకే సీఎం కేసీఆర్ ఇలాంటి పథకాలను అమలు చేస్తున్నారని వివరించారు. అందుకని పథకాలు అందుకున్న లబ్ధిదారులు సీఎం కేసీఆర్ను మరోసారి ఆశీర్వదించాలని కోరారు. ఆయన మళ్లీ సీఎం అయితేనే మరిన్ని పథకాలు అమలవుతాయని అన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు రాఘవరెడ్డి, పోశం నర్సింహారావు, గుడిపూడి కోటేశ్వరరావు, కుర్రి నాగేశ్వరరావు, ముత్యం బాబు, అడపా అప్పారావు, బొలిశెట్టి నవీన్, రామిడి రామిరెడ్డి, వట్టం రాంబాబు, తాళ్లపల్లి యాదగిరిగౌడ్, ముద్దంగుల కృష్ణ, వెంకటరెడ్డి, జావేద్పాషా తదితరులు పాల్గొన్నారు.