‘వచ్చే శాసనసభ ఎన్నికల్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో విజయం సాధించి గులాబీ జెండా ఎగురవేస్తాం’ అని ప్రభుత్వ విప్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు అన్నారు. గురువారం భద్రాచలంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
– భద్రాచలం, ఆగస్టు 24
భద్రాచలం, ఆగస్టు 24 : వచ్చే శాసనసభ ఎన్నికల్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో విజయం సాధించి గులాబీ జెండా ఎగురవేస్తామని ప్రభుత్వ విప్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు అన్నారు. గురువారం భద్రాచలంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు మూడు నెలలపాటు కష్టపడితే మూడు దశాబ్దాల రాజకీయ భవిష్యత్‌ను మీకిచ్చే బాధ్యత తనదన్నారు. భద్రాచలం నియోజకవర్గ ప్రజలు సీఎం కేసీఆర్ పట్ల విశ్వాసంతో ఉన్నారని, రాబోయే ఎన్నికల్లో భద్రాచలం అభ్యర్థి డాక్టర్ తెల్లం వెంకట్రావును ఆశీర్వదించి గెలిపించే బాధ్యత తమదేనని స్పష్టం చేశారు. ఐదు దశాబ్దాలపాటు రాష్ర్టాన్ని పాలించిన ప్రభుత్వాలకు కనీసం ప్రజలకు మంచినీళ్లు ఇచ్చిన దాఖలాలు కూడా లేవన్నారు. సీఎం కేసీఆర్ ప్రతి ఇంటికి మంచినీళ్లు ఇచ్చారని, ఈ విషయంలో ఆయా పార్టీల నాయకులు సిగ్గుపడాలన్నారు.
భద్రాచలంలో కరకట్టల నిర్మాణానికి రూ.2,200 కోట్లతో అంచనాలు రూపొందించి అధికారుల బృందం అందజేసిందన్నారు. దీంతో సీఎం కేసీఆర్ ఒడిశా, యూపీ రాష్ర్టాల్లో కరకట్టల పరిశీలనకు ప్రత్యేక కమిటీ, సీఎంవో అధికారులను పంపించారన్నారు. అలాగే భద్రాచలం ఖిల్లాపై గులాబీ జెండా ఎగురవేసి.. నిన్ను భద్రాచలం నుంచి సాగనంపుతామంటూ స్థానిక ఎమ్మెల్యేపై పరోక్షంగా మాట్లాడారు. తెలంగాణ సంక్షేమ పథకాల దేశానికే ఆదర్శంగా నిలిచాయని, ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందేలా ముందుకెళ్తున్నామన్నారు. సీఎం కేసీఆర్‌కు తెలంగాణ అభివృద్ధిపై పూర్తి విజన్ ఉందని, అలాంటి నాయకుడికి తెలంగాణ ప్రజలంతా అండగా ఉండాలన్నారు. రాబోయే ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ ఘన విజయం సాధించాలని భద్రాద్రి రామున్ని కోరుకుంటున్నానని అన్నారు. సమావేశంలో ఎమ్మెల్సీ తాతా మధు, భద్రాచలం బీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ తెల్లం వెంకట్రావు పాల్గొన్నారు.