భద్రాచలం, ఫిబ్రవరి 20 : రాబోయే ఎన్నికల్లో పదికి పది సీట్లు బీఆర్ఎస్ పార్టీ సునాయాసంగా గెలుస్తుందని, కార్యకర్తలు ఎవరూ అధైర్యపడొద్దని ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు అన్నారు. సోమవారం భద్రాచలం బీఆర్ఎస్ కార్యాలయంలో ఆ పార్టీ మండల అధ్యక్షుడు అరికెల్ల తిరుపతిరావు అధ్యక్షతన ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల హడావుడి మొదలైందని, భద్రాద్రి, ఖమ్మం జిల్లాలో రాజకీయాలు వేడెక్కాయని అన్నారు.
కొంతమంది పార్టీ నుంచి బయటికి వెళ్లేందుకు ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు. కేసీఆర్ నాయకత్వం మీద నమ్మకం ఉన్న వ్యక్తులు ఎవరొచ్చినా పార్టీలోకి స్వాగతిస్తామని చెప్పారు. పార్టీలో ఉంటూ పార్టీని బద్నామ్ చేస్తే ఊరుకునేది లేదన్నారు. ఎవరో వీడినంత మాత్రాన పార్టీకి నష్టం జరగదని, వారే నష్టపోతారని స్పష్టం చేశారు. ఏ పార్టీలో చేరాలో వారికే స్పష్టత లేదని ఎద్దేవా చేశారు. కొంతమంది ఏజెంట్లను పెట్టుకొని డబ్బుతో కార్యకర్తలు, నాయకులను కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, ప్రజాక్షేత్రంలో వారి ఆటలు సాగవని హెచ్చరించారు. మంచి నాయకత్వం ఉన్న బీఆర్ఎస్ పార్టీపై నమ్మకం ఉంచాలన్నారు.
వ్యక్తులు ముఖ్యంకాదని, పార్టీ ఎజెండానే ముఖ్యమన్నారు. 2023లో జరిగే ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం తథ్యమని, ముచ్చటగా మూడోసారి కూడా బీఆర్ఎస్ విజయ దుందుభి మోగిస్తుందని చెప్పారు. ప్రత్యేక తెలంగాణ సాధించుకున్నాక రైతులకు రైతుబంథు, రైతుబీమా, 24గంటల విద్యుత్, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, మిషన్ భగీరథ లాంటి అనేక సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని, ప్రతి ఇంటికీ ఏదో ఒక సంక్షేమ పథకం అందుతున్నదని పేర్కొన్నారు. యావత్ దేశమే సీఎం కేసీఆర్ వైపు చూస్తుందని చెప్పారు. కార్యకర్తలకు ఏ అవసరమొచ్చినా ఆదుకుంటామని తెలిపారు. కాంగ్రెస్ నాయకులు తనకు 300ఎకరాలు ఉన్నట్లు దుష్ప్రచారం చేస్తున్నారని, నిరూపించమని చాలెంజ్ చేస్తే ముందుకురావడం లేదన్నారు. కార్యక్రమంలో చర్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బొదెబోయిన బుచ్చయ్య, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు తిప్పన సిద్ధులు, కోటగిరి ప్రభోద్కుమార్, మానె రామకృష్ణ, మాజీ సర్పంచ్ భూక్యా శ్వేత, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.