భద్రాద్రి కొత్తగూడెం, జూన్ 12 (నమస్తే తెలంగాణ) : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తొలిరోజు సర్కారు బడులు తుస్సుమన్నాయి. విద్యార్థులు అనుకున్న సంఖ్యలో రాకపోవడంతో పాఠశాలలు వెలవెలబోయాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్భాటంగా నిర్వహించిన ‘బడిబాట’ కార్యక్రమం ఏమాత్రం ఫలితమివ్వలేదు. జిల్లా మొత్తంలో లక్షల సంఖ్యలో ఉన్న విద్యార్థులు మొదటిరోజు వేలసంఖ్యకు పడిపోయారు. బడికి రావాల్సిన పిల్లలు బడిబయట ఆడుకునే పరిస్థితి వచ్చింది. బడిబాట పేరుతో ఈ నెల 6వ తేదీ నుంచి ప్రభుత్వ ఉపాధ్యాయులు, అంగన్వాడీ టీచర్లు ర్యాలీలు చేసి మరీ అవగాహన కల్పించినా పిల్లల సంఖ్య ప్రారంభంరోజు లేకపోవడంతో పాఠశాలలు బోసిపోయాయి. ‘మన ఊరు-మన బడి’ ద్వారా గత కేసీఆర్ సర్కారు కోట్ల రూపాయలు వెచ్చించి ప్రభుత్వ పాఠశాలలను సర్వాంగ సందరంగా తీర్చిదిద్దిన విషయం విదితమే. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం పాఠశాలలపై దృష్టి పెట్టకపోవడంతో ప్రారంభరోజు వెలవెలబోవాల్సి వచ్చింది. ఇటీవల కొలువుదీరిన కాంగ్రెస్ సర్కారు ‘మన ఊరు-మన బడి’ స్థానంలో అమ్మ ఆదర్శ పాఠశాలలు అని పేరు పెట్టి నిధులు మంజూరు చేసినా ఆ పాఠశాలలకు కనీసం రంగులు కూడా వేయని దుస్థితి దాపురించింది. పాత గోడలు, మరమ్మతు చేయని గోడలు దర్శనమిస్తున్నాయి. పిల్లలకు తొలిరోజు ఒక జత యూనిఫాం ఇవ్వాల్సి ఉండగా.. 20 శాతం పాఠశాలలకు యూనిఫాం ఇవ్వలేకపోయారు. లక్ష్మీదేవిపల్లి మండలం రేగళ్ల యూపీ స్కూల్లో విద్యార్థులకు యూనిఫాం ఇవ్వలేదు. రేగళ్ల పాఠశాలనే కాదు జిల్లాలోని చండ్రుగొండ, బూర్గంపాడు, కొత్తగూడెం మండలాల్లోని కొన్ని పాఠశాలలకు యూనిఫాంలు అందలేదని అక్కడి ఉపాధ్యాయులే చెప్పడం గమనార్హం.
ప్రారంభంలోనే తగ్గిన విద్యార్థులు
పునఃప్రారంభం రోజు మామిడి తోరణాలతో తళుక్కున మెరవాల్సిన పాఠశాలలు విద్యార్థులు లేక వెలవెలబోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిలువుటద్దంగా చెప్పొచ్చు. అమ్మ ఆదర్శ పాఠశాలల పేరుతో జిల్లాలో 642 పాఠశాలలకు రూ.26 కోట్లు మంజూరు చేసినా అవి మరమ్మతులకు నోచుకోలేకపోవడం విచారకరం. ప్రస్తుతం అవి పాతరంగులతో వెలవెలపోతున్నాయి. లక్ష్మీదేవిపల్లి మండలం రేగళ్ల యూపీ స్కూల్‌కు తొలిరోజు 18 మంది పిల్లలే వచ్చారు. కొంతమంది విద్యార్థులు ఇంటివద్దనే ఆటలు ఆడుకుంటున్నారు. రేగళ్లతండాలో ఉన్న ఆశ్రమ పాఠశాలలో 200 మంది విద్యార్థులకు కేవలం 13 మందే స్కూల్‌కు వచ్చి ప్రార్థనలో పాల్గొన్నారు. అక్కడ 17 మంది టీచర్లు ఉండగా.. 13 మంది మాత్రమే పిల్లలు రావడం గమనార్హం.
అరకొర సౌకర్యాలతో.. 
పాఠశాలల ఆవరణలు ఇంకా పిచ్చిమొక్కలతోనే దర్శనమిస్తున్నాయి. మరుగుదొడ్లు సక్రమంగా లేవు.. మిషన్ భగీరథ తాగునీరు అంతంతమాత్రమే. కొన్ని పాఠశాలల్లో మొక్కుబడిగా భగీరథ ట్యాప్‌లు గోడలకు ఏర్పాటు చేశారు. పాఠశాలను శుభ్రం చేయాల్సిన స్వీపర్లకు వేతనాలు లేక ఇబ్బందులు పడుతున్నట్లు చెబుతున్నారు.
20 శాతం యూనిఫాంలే అందలేదు..
మహిళా సంఘాల ద్వారా విద్యార్థులకు యూనిఫాంలు కుట్టించాం. దాదాపు అన్ని పాఠశాలలకు సరిపడా క్లాత్‌లు ఇచ్చాం. చాలా తొందరగా కుట్టు పనులు పూర్తయ్యాయి. కేవలం 20 శాతం మాత్రమే అందలేదు.. రెండు రోజుల్లో క్లియర్ అవుతుంది. తొలిరోజు కదా అని కొంతమంది తల్లిదండ్రులు పిల్లలను బడికి పంపలేదు.. అందుకే సంఖ్య తగ్గింది. అమ్మ ఆదర్శ పాఠశాలల మరమ్మతులు ముమ్మరంగా జరుగుతున్నాయి. త్వరలోనే పూర్తి చేస్తాం.
– వెంకటేశ్వరాచారి, డీఈవో, భద్రాద్రి కొత్తగూడెం