Government Schools | ఖమ్మం, డిసెంబర్ 29 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): విద్యార్థులతో కళకళలాడాల్సిన సర్కారు బడులు వెలవెలబోతున్నాయి. విద్యార్థులు లేక పాఠశాలలకు తాళాలు వేస్తున్న పరిస్థితి నెలకొన్నది. సర్కారు బడుల్లో నైపుణ్యం గల ఉపాధ్యాయులకు కొదవలేదు. అయినా నాణ్యమైన విద్యను అందించలేని దుస్థితి. ఈ కారణంగా తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చదివించేందుకు తల్లిదండ్రులు ఆసక్తి చూపడం లేదు.
కార్పొరేట్ విద్యాసంస్థలకు దీటుగా ప్రభుత్వ విద్యావిధానంలో మార్పు తెస్తామని కొత్తగా వచ్చిన ప్రభుత్వం చెబుతున్నా ఆచరణలో మాత్రం చతికిలపడుతోంది. కొన్ని పాఠశాలలకు పట్టుమని పదిమంది పిల్లలు కూడా రావట్లేదు. సర్కారు విద్య పురోగమించకపోగా.. తిరోగమనం వైపు పయనిస్తుండడం ఆందోళన కలిగించే అంశం.
తల్లాడ మండలంలో వెంకటాపురంలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల (ఎంపీపీఎస్) ఉంది. కే.ఏడుకొండలు టీచర్ అక్కడ విధులు నిర్వహిస్తున్నారు. జూన్‌లో ముగ్గురు విద్యార్థులు ప్రవేశాలు పొందారు. కానీ అదే నెల చివరలో వారు ప్రైవేట్ స్కూల్లో జాయిన్ అయ్యారు. విద్యార్థులు లేకపోవడంతో కేశవాపురం ఎంపీపీఎస్‌కు ఓరల్ డిప్యూటేషన్ కేటాయించారు. అక్కడ ఐదుగురు విద్యార్థులున్నారు. రెగ్యులర్ బదిలీల్లో కేశవాపురం టీచర్‌ను కేటాయించడంతో డిప్యూటేషన్‌పై అతడిని ఎంపీపీఎస్ ముద్దునూరుకు నవంబర్ మొదటి వారంలో పంపించారు. అప్పటి వరకు యూపీఎస్ ముద్దునూరులో పిల్లలు లేరు.
ఊర్లో అందరినీ కలిసి స్కూలుకు పిల్లలను పంపాలని అడిగితే మూడో తరగతి విద్యార్థిని ఒకరు ప్రవేశం పొందింది. నెల తర్వాత ఉన్న ఆ ఒక్క విద్యార్థినిని కూడా ఆమె కుటుంబీకులు ఇక్కడ మాన్పించి వేరే స్కూల్లో జాయిన్ చేశారు. ఇప్పుడు అక్కడ ప్రస్తుతం విద్యార్థులెవరూ లేరు. ఇప్పుడు ఆ స్కూల్లో విద్యార్థులు లేరు. ఒక్క ఉపాధ్యాయుడు ఉన్నారు. ఖమ్మం జిల్లాలో 64 ప్రాథమిక పాఠశాలలు పిల్లలు లేకపోవడంతో ఇదే తరహాలో వెలవెలబోతున్నాయి. ఈ పరిస్థితిలో మార్పు తెచ్చేందుకు అధికారులు, ఉపాధ్యాయులు పూర్తిస్థాయిలో కృషిచేసిన దాఖలాలు కనిపించడం లేదు.
జిల్లాలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. పిల్లల్లేని పాఠశాలలకు మూసివేత ముప్పు పొంచి ఉంది. జిల్లాలో ఇప్పటికే ఒక్క విద్యార్థి కూడా లేని పాఠశాలలను 64గా గుర్తించారు. అక్కడ పనిచేస్తున్న ఉపాధ్యాయులను ఇతర పాఠశాలల్లో సర్దుబాటు చేసి ఆయా పాఠశాలల మూసివేతకు రంగం సిద్ధం చేశారు. జిల్లాలో వివిధ మండలాల్లో 64 పాఠశాలల్లో ఒక్క విద్యార్థి కూడా లేరు. అదే విధంగా మరో 50కిపైగా ప్రాథమిక పాఠశాలల్లో కేవలం పది మందిలోపు మాత్రమే పిల్లలు ఉన్నారు. వీటిల్లో కొన్ని పాఠశాలల్లో ఈ విద్యాసంవత్సరంలో ఒక్క విద్యార్థి కూడా చేరలేదు.
దీన్ని బట్టి జిల్లాలో ప్రాథమిక పాఠశాలల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. కొన్ని పాఠశాలల పరిధిలోని ఆవాస ప్రాంతాల్లో బడిఈడు పిల్లలు లేరు. పాఠశాలలు తెరిచిన వెంటనే బడిబాట కార్యక్రమం చేపడుతున్నప్పటికీ చిత్తశుద్ధి లోపించడంతో అది కూడా చతికిలపడుతుంది. 2024-25 విద్యాసంవత్సరం ఆరంభంలో బడిబాట నిర్వహించి వేలాది మందిని పాఠశాలల్లో చేర్పించామని అధికారులు లెక్కలు వివరించి మరీ చూపించారు. క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి.
పిల్లలు లేని కారణంగా మూతబడిన వాటిల్లో ఇప్పటి వరకూ ప్రాథమిక పాఠశాలలే ఉన్నాయి. కానీ ఇదే కారణంగా తొలిసారిగా ఓ ఉన్నత పాఠశాల కూడా మూతబడింది. అక్కడి ఉపాధ్యాయులను ఇతర పాఠశాలలకు సర్దుబాటు చేశారు. వైరా మండలం అష్ణగుర్తి ప్రభుత్వ ఉన్నత పాఠశాలది ఈ పరిస్థితి. పిల్లల్లేని పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులను పిల్లలున్న పాఠశాలలకు సర్దుబాటు చేశారు. ఇప్పటి వరకు పిల్లల్లేని పాఠశాలలకు కూడా ఉపాధ్యాయులను కేటాయించి వారి సేవలను పిల్లలున్న ఇతర పాఠశాలల్లో వినియోగించుకునేవారు. వేతనాలు మాత్రం పిల్లలు లేని పాఠశాలల నుంచే డ్రా చేసేవారు.
ఈ విద్యాసంవత్సరంలో జీరో ఎన్రోల్మెంట్ స్కూళ్ల వివరాలు మండలాల వారీగా ఇలా ఉన్నాయి. వాటిల్లో ఏన్కూరు మండలంలో ఎంపీపీఎస్ రాజులపాలెం, కల్లూరు మండలంలో ఎంపీపీఎస్ పాయాపూర్, ఎంపీపీఎస్ విశ్వనాథపురం, ఎంపీయూపీఎస్ లక్ష్మీపురం, ఖమ్మం అర్బన్ మండలంలో ఎంపీపీఎస్ రుద్రంకోట, రఘునాథపాలెం మండలంలో ఎంపీపీఎస్ మల్లేపల్లి, తిరుమలాయపాలెం మండలంలో ఎంపీపీఎస్ అజ్మీరతండా, ఎంపీపీఎస్ జోగులపాడు, ఎంపీపీఎస్ నాయకన్తండా, వేంసూరు మండలంలో ఎంపీపీఎస్ తుంగవరి కాలనీ, ఎర్రుపాలెం మండలంలో ఎంపీపీఎస్ చొప్పకట్లపాలెం ఉన్నాయి.
జీరో ఎన్రోల్మెంట్ ఉన్న పాఠశాలల్లో వచ్చే విద్యాసంవత్సరం నుంచి పిల్లలు ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. సర్కారు స్కూళ్లలో చదివితే కలిగే ప్రయోజనాల గురించి వేసవి నుంచే పిల్లలకు వివరించి అడ్మిషన్లు పెంచేందుకు చర్యలు తీసుకుంటాం. ప్రస్తుతం విద్యార్థులు లేని స్కూళ్లలో టీచర్లు ఉంటే వారిని ఇతర పాఠశాలల్లో సర్దుబాటు చేసి సేవలు వినియోగిస్తున్నాం.
-సోమశేఖరశర్మ, డీఈవో ఖమ్మం