ఖమ్మం, జూలై 31 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : నగరంలోని మున్నేరు లోతట్టు ప్రాంత ప్రజల సమస్యకు శాశ్వత పరిష్కారం లభించింది. గతంలో వచ్చిన వరదలు.. ప్రస్తుత వరదలను కళ్లారా చూసిన మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ మున్నేరు వరద ముప్పు నుంచి శాశ్వత పరిష్కారానికి కృషి చేశారు. రెండు రోజుల క్రితం మున్నేరు వరద బాధితులకు పువ్వాడ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులను పంపిణీ చేసిన సందర్భంగా మంత్రి పువ్వాడ వరద బాధితులకు హామీ ఇచ్చారు. ఇప్పటికే రూ.147కోట్లతో మున్నేరుకు ఇరువైపులా ఆర్సీసీ కాంక్రీట్ వాల్ నిర్మించడానికి ప్రతిపాదనలు సిద్ధం చేశామని, సీఎం కేసీఆర్‌తో మాట్లాడి అనుమతులు మంజూరు చేయిస్తానని శనివారం ప్రకటించిన విషయం విదితమే. 48 గంటల్లోనే ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం మున్నేరు వరద ముంపు ప్రాంత ప్రజల కష్టాలను సీఎం కేసీఆర్‌కు, మంత్రి కేటీఆర్‌లకు వివరించారు. ఇరువైపులా ఆర్సీసీ కాంక్రీట్ వాల్ నిర్మించాల్సిన ఆవకశ్యతపై ఒప్పించి నిధులు మంజూరయ్యేలా కృషి చేశారని నగర ప్రజలు పేర్కొంటున్నారు.
మున్నేరుకు కరకట్ట నిర్మిస్తే ఈ వాగుకు ఇరువైపులా ఇళ్లు నిర్మించుకున్న పేద, మధ్యతరగతి ప్రజలు ఆవాసాలను కోల్పోవాల్సి వస్తుందని, అలా అయితే కరకట్ట అవసరం లేదని, ఆర్సీసీ కాంక్రీట్ వాల్ నిర్మిస్తే ఇళ్లకు ఎలాంటి నష్టం వాటిల్లదని సీఎం కేసీఆర్‌కు మంత్రి అజయ్ వివరించి ఒప్పించారు. సోమవారం హైదరాబాద్‌లో జరిగిన క్యాబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకోవడంతో మున్నేరుకు శాశ్వత పరిష్కారం లభించింది. మున్నేరుకు నాయుడుపేట వైపు 6 కిలోమీటర్లు, ఖమ్మం వైపు 5 కిలో మీటర్ల మేర ఆర్సీసీ కాంక్రీట్ వాల్ నిర్మించనున్నారు. ఇప్పటికే ఈ ప్రాంతంలో రూ.140కోట్లతో తీగల వంతెన నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ఆ పనులకు త్వరలోనే టెండర్లు పూర్తికానున్నాయి. ఒక వైపు తీగల వంతెన, మరో వైపు మున్నేరుకు రెండు వైపులా ఆర్సీసీ కాంక్రీట్ వాల్ నిర్మాణంతో మున్నేరు రూపం మారనుంది. భవిష్యత్ పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందచే అవకాశం కూడా ఉంది. మున్నేరు వరద నుంచి తమ కష్టాలను శాశ్వతంగా దూరం చేసిన సీఎం కేసీఆర్‌కు, మంత్రి పువ్వాడకు జీవితాంతం రుణపడి ఉంటామని ముంపు ప్రాంత ప్రజలు పేర్కొంటున్నారు. కాగా.. సీఎం కేసీఆర్‌కు మంత్రి పువ్వాడ కృతజ్ఞతలు తెలిపారు.