ఇంజినీరింగ్ చదవాలన్నా.. మెడిసిన్ చేయాలన్నా ఇంటర్మీడియట్ విద్యనే విద్యార్థుల భవిష్యత్‌ను మార్చేది. ఇప్పుడు ఆ ఇంటర్ చదివే విద్యార్థులు సర్కారు కాలేజీలకు నో చెప్పి ప్రైవేటుకు సై అంటున్నారు. మరి తప్పెవరిది అంటే సర్కారుదేననే సమాధానం వస్తున్నది. కార్పొరేట్ స్థాయిలో వసతి సౌకర్యాలు కల్పించకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ప్రైవేట్ చదువులకు ప్రాధాన్యమిస్తున్నారు.
ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు అధిక ఫీజులు వసూళ్లు చేస్తున్నా ప్రైవేటుకే మొగ్గు చూపుతున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. జిల్లాలో ప్రతియేటా సర్కారు కాలేజీల్లో విద్యార్థుల నమోదుశాతం తగ్గుతూనే ఉంది. అయినా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టకపోవడం వల్ల విద్యారంగం నీరుగారిపోతున్నది. విద్యార్థి సంఘాలు గొంతెత్తి మొత్తుకున్నా రాష్ట్ర ప్రభుత్వం విద్యావ్యవస్థలో మార్పులు తీసుకురావడం లేదు.
– భద్రాద్రి కొత్తగూడెం, జూన్ 1 (నమస్తే తెలంగాణ)
భద్రాద్రి కొత్తగూడెం జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ కాలేజీలు 14 ఉన్నాయి. వీటితోపాటు సంక్షేమ హాస్టళ్లతో కూడిన కాలేజీలు 56 ఉన్నాయి. అయినా ఇందులో ఉండాల్సిన 4,006 మంది విద్యార్థులకు గాను గత ఏడాది 2,900 మంది మాత్రమే ప్రభుత్వ కాలేజీల్లో చేరినట్లు లెక్కలు చెబుతున్నాయి. మరి ప్రైవేటు కాలేజీలు జిల్లాలో 30 ఉన్నా అందులో 5,000 మంది విద్యార్థులు చదువుతున్నారు. గ్రూప్ ఏదైనా కాలేజీ ముఖ్యమని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రైవేటు కాలేజీలకు ఆసక్తి చూపుతున్నారు.
ప్రభుత్వ కాలేజీలు ఆయా గ్రామాలకు దూరంగా ఉండటంతోపాటు రవాణా సౌకర్యాలు లేకపోవడం ఆర్టీసీ బస్సు వస్తేనే తప్ప మండల కేంద్రాలకు చేరుకునే పరిస్థితి లేదు. కాలేజీ విద్యార్థులకు ప్రత్యేక బస్సులు లేకపోవడం కూడా విద్యార్థుల సంఖ్య ప్రభుత్వకాలేజీల్లో తగ్గడానికి కారణమనే చెప్పాలి. ఇదేకాక కాలేజీల దగ్గర్లో ఉన్న కాలేజ్ మేనేజ్మెంట్ హాస్టల్స్‌లో సరైన వసతులు లేకపోవడం వల్ల విద్యార్థులు సర్కారు కాలేజీలపై ఆసక్తి చూపడం లేదు.
‘మా కాలేజీలోనే చదవండి’ అని ప్రభుత్వ అధ్యాపకులు, ప్రైవేటు యాజమాన్యాలు ఇంటింటి ప్రచారాల్లో పోటీ పడుతున్నారు. ప్రైవేటు యాజమాన్యాలు ప్రత్యేక సిబ్బందిని పెట్టి విద్యార్థి ఇంటికి వెళ్లి అవసరమైతే వాళ్ల బంధువులు,స్నేహితులతో మాట్లాడించి విద్యార్థిని ఒప్పించడంలో సఫలమవుతున్నారు.
ప్రభుత్వ కాలేజీ అధ్యాపకులు కేవలం విద్యార్థుల ఇంటికెళ్లి అవగాహన కల్పిస్తున్నారు కానీ తల్లిదండ్రులను ఒప్పించడంలో విఫలమవుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో ప్రైవేటు యాజమన్యాలు విద్యార్థుల సంఖ్యను పెంచుకోవడంలో సక్సెస్ అవుతున్నారు. గత నెలరోజుల నుంచి కాలేజీ నిర్వాహకులు ఇంటింటి ప్రచారంలో నిమగ్నమయ్యారు. ఇప్పటికే చాలామందిని ప్రైవేటు కాలేజీల్లో చేర్పించేశారు. బీటెక్ చదవాలంటే ఇంటర్‌లోనే మంచి మార్కులు రావాలని అవగాహన కల్పించడంతో విద్యార్థుల తల్లిదండ్రులు బయట కాలేజీల్లో చదివించడానికి ఆసక్తి చూపుతున్నారు.
ప్రభుత్వ కాలేజీల్లో ఎలాంటి ఫీజులు లేవు. కేవలం పరీక్ష ఫీజు రూ.520 చెల్లిస్తే చాలు. 12నెలల స్కాలర్షిప్ కూడా వచ్చేస్తుంది. టెస్టు పుస్తకాలు ఉచితంగా ఇస్తున్నారు. అయినా సీట్లు భర్తీ కావడంలో ఏడాదికేడాది వెనుక వరుసలోనే ఉంటున్నారు. ఈసారి పూర్తిస్థాయిలోఅధ్యాపకులను కూడా ప్రభుత్వం భర్తీచేసి పూర్తిస్థాయిలో సీట్లు భర్తీ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నది. మొత్తం కాలేజీల్లో 160మంది అధ్యాపకులు ఉన్నారు. 11మంది కాంట్రాక్ట్ అధ్యాపకులు విధులు నిర్వహిస్తున్నారు. ఖాళీగా ఉన్న 23మంది అధ్యాపకులను ఇటీవల ప్రభుత్వం భర్తీ చేసింది. మరో 27మంది గెస్టు లెక్చరర్లను కూడా కొనసాగిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. దీంతో సర్కారు కాలేజీల్లో అధ్యాపకులు పోస్టులు ఎక్కడా ఖాళీలేవనే చెప్పాలి. అయినా సీట్లు భర్తీ అవుతాయా లేదా అనేది ప్రశ్నార్థకం.
వసతి సౌకర్యాలు కోసం ప్రభుత్వం గురుకులాలను అందుబాటులోకి తీసుకురావడంతో ప్రభుత్వ కాలేజీల్లో సీట్లు భర్తీ కావడం లేదు. తీరా అక్కడ కూడా సరైన సౌకర్యాలు కల్పించలేకపోవడంతో విద్యార్థులు ప్రైవేటు కాలేజీల్లో చేరుతున్నారు. తల్లిదండ్రులను ఒప్పించడంలో ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తున్నది. కార్పొరేట్ స్థాయిలో ప్రభుత్వ కాలేజీలను బలోపేతం చేయాలి. ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయాలి.
– కే.పృథ్వీ, పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు, స్టూడెంట్స్ యూనియన్
మా అబ్బాయి 2024లో పదో తరగతి ప్రభుత్వ స్కూల్లోనే చదివాడు. టాపరు కూడా. ప్రభుత్వ కాలేజీలో చదివించాలి అనుకున్నా. కానీ పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలంటే మంచి ప్యాకల్టీ ఉండాలని ప్రైవేట్‌లోనే చదివించాను. మండల హెడ్‌క్వార్టర్‌లో కాలేజీ ఉంది.. చాలామంది దూరప్రాంతాల రాలేక హాస్టల్స్‌లో ఉంటున్నారు.
– దల్లి సతీష్‌రెడ్డి, దుమ్ముగూడెం మండలం
ప్రైవేటు కాలేజీల్లో హాస్టల్ సౌకర్యం ఉండటం వల్ల తల్లిదండ్రులు అక్కడ ఉంచడానికి ఇష్టపడుతున్నారు. దూరప్రాంతాల నుంచి వచ్చేవారు హాస్టల్లో ఉండి చదువుకుంటే క్రమశిక్షణతోపాటు సమయం ఆదా అయ్యి చదువుపై ఇంట్రెస్ట్ పెరుగుతుందని తల్లిదండ్రులు ప్రైవేటు వైపు వెళ్తున్నారు. కానీ పేద విద్యార్థులు చాలా నష్టపోతున్నారు. ప్రభుత్వ కాలేజీల్లో కూడా చాలా సౌకర్యాలు ఉన్నాయి. కాలేజీ మేనేజ్మెంట్ హాస్టల్ ఉంది. ఎలాంటి ఫీజులు ఉండవు. అధ్యాపకులు కూడా పూర్తిస్థాయిలో ఉన్నారు. ఆడపిల్లలకు ఉచిత బస్సు సౌకర్యం కూడా ఉంది. తల్లిదండ్రులు అర్థం చేసుకుంటే పిల్లల భవిష్యత్ బాగుపడుతుంది.
-వెంకటేశ్వరరావు, ఇంటర్మీడియట్ జిల్లా అధికారి