సంక్షేమ వసతి గృహాల్లోని విద్యార్థులకు డైట్ చార్జీలను 200 శాతం పెంచినట్లు కాంగ్రెస్ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటున్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో ఎక్కడా కానరావడం లేదు. ‘నాణ్యతతో కూడిన పౌష్టికాహారం’ అనేది కేవలం మాటలకే పరిమితమవుతోంది. ముగ్గురు మంత్రుల ఇలాఖాగా ఉన్న ఖమ్మం జిల్లాలో మొత్తంగా మెనూకే తిలోదకమిచ్చినట్లు స్పష్టమవుతోంది. కారం కలిపిన కూర, నీళ్లను తలపిస్తున్న సాంబార్, ఉడికీ ఉడకని అన్నం తప్ప మెనూ అనే మాటే లేకుండా పోయింది.
అప్పుడప్పుడూ నాణ్యతలేని కోడి గుడ్లు తప్ప మరేమీ కన్పించడం లేదు. పైగా, జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ శాఖలు తమ తమ హాస్టళ్లలో సొంత మెనూను అమలు చేసుకుంటుండడం గమనార్హం. ఫలితంగా.. పేద విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారం అందడమే లేదు. మరోవైపు రాష్ట్రంలోని గురుకులాలు, సంక్షేమ వసతి గృహాల్లో ఫుడ్పాయిజన్లు జరిగి కొందరు విద్యార్థులు మృత్యువాత పడుతున్నా, మరికొందరు విద్యార్థులు ఆసుపత్రుల పాలవుతున్నా.. కాంగ్రెస్ సర్కారు మాత్రం తీవ్రమైన నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోంది. పైగా డైట్ చార్జీలు పెంచామని, కామన్ మెనూ అమలు చేస్తున్నామని హడావిడి చేస్తోంది. మంత్రులు కూడా ఆర్భాటపు ప్రచారాలు చేస్తూ ఫొటోలకు ఫోజులిస్తున్నారు. -మామిళ్లగూడెం, జూలై 27
‘పేరు గొప్ప ఊరు దిబ్బ’ అన్నట్లుగా ఉంది సంక్షేమ వసతి గృహాల్లో మెనూ అమలు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వ ఆర్భాటపు ప్రచారం పరిస్థితి. చెప్పుకోవడానికి జిల్లాకు ముగ్గురు మంత్రులున్నారు. డైట్ చార్జీలు పెంచామంటూ ఊదరగొడుతున్నారు. ఫొటోలకు ఫోజులూ ఇస్తున్నారు. కానీ, క్షేత్రస్థాయిలో కామన్ మెనూ మాత్రం అమలుకావడం లేదు.
రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖల్లోని సాధారణ వసతి గృహాలు, ఆశ్రమ పాఠశాలలు, కేజీవీబీలు, గురుకుల విద్యాలయాల్లో చదువుతున్న పేద విద్యార్థులకు ఇప్పటివరకు ఉన్న డైట్ చార్జీలను 200 శాతం పెంచామని, అన్ని హాస్టళ్లలోనూ కామన్ మెనూ అమలు చేస్తున్నామని ఇటీవల హోరెత్తించారు. విద్యా సంవత్సరం ప్రారంభంలో తెగ హడావిడి చేశారు. కామన్ మెనూ అంటూ ప్రచారం చేశారు. తరువాత కామ్‌గా ఉండి దాన్ని కామన్‌గా వదిలేశారు.
ఖమ్మం జిల్లాలో ఎస్సీ-52, ఎస్టీ-15, బీసీ-30 సాధారణ వసతి గృహాల్లో ఆయా విద్యార్థులు వసతి పొందుతూ సమీపంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్యసిస్తున్నారు. వారికి నాణ్యతతో కూడిన పౌష్టికాహారాన్ని అందించి వారి విద్యాభివృద్ధికి తోడ్పడతామని ప్రభుత్వం ప్రకటించింది. కానీ, అమలులో ఆ ఛాయలు ఎక్కడా కన్పించడం లేదు. పాఠశాల, కళాశాల స్థాయి విద్యార్థులకు వసతి సౌకర్యాలు కల్పించే ప్రీ, పోస్టు మెట్రిక్ హాస్టళ్లు జిల్లాలో 97 ఉన్నాయి.
వీటిల్లో కామన్ మెనూ స్థానంలో కారం నీళ్లను తలపిస్తున్న పప్పు, సాంబారు; ఉడకని కూరలు, నాసికరం కోడి గుడ్లు అందిస్తూ కాలం వెళ్లదీస్తున్నారు. మెనూలో పెట్టాల్సిన అల్పాహారం, అనుబంధ ఆహారం జాడే లేదు. ఇప్పటికే రాష్ట్రంలోని పలు గురుకుల, వసతి గృహాల్లో ఫుడ్ పాయిజన్లతో విద్యార్థులు మరణించిన, ఆసుపత్రుల పాలైన ఘటనలు ఉన్నాయి. అయినప్పటికీ ప్రభుత్వంలో చలనం లేకుండా పోయింది.
కొందరు విద్యార్థుల ఆకతాయి చేష్టల కారణంగా జిల్లాలోని పలు వసతి గృహాల్లో విద్యార్థుల మధ్య తరచూ ఘర్షణలు జరుగుతున్నాయి. ప్రభుత్వ నిర్లక్ష్యం, వార్డెన్ల పర్యవేక్షణ లోపం వంటివి ఇందుకు కారణమవుతున్నాయి. ఖమ్మంలో ఇటీవల జరిగిన కొన్ని ఘర్షణలు తీవ్రతకు అద్దం పడుతున్నాయి. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. నగరంలోని ఒక బీసీ కళాశాల బాలుర వసతి గృహంలో కొందరు సీనియర్ విద్యార్థులు ఇటీవల మద్యం తెచ్చుకొని తాగారు.
అనంతరం తమ మాట వినడం లేదంటూ జూనియర్ విద్యార్థులపై దాడి చేశారు. జూనియర్ విద్యార్థుల తల్లిదండ్రులకు విషయం తెలియడంతో వారు హాస్టల్‌కు చేరుకొని వార్డెను నిలదీశారు. గొడవలు చేసిన సీనియర్ విద్యార్థులను వసతి గృహం నుంచి పంపించామని నచ్చజెప్పి విషయం బయటకు రాకుండా జాగ్రత్త పడ్డారు. నిరుడు బైపాస్ రోడ్డులో ఉన్న ఎస్సీ బాలుర కళాశాల వసతి గృహంలో కొందరు విద్యార్థులు మద్యం తాగి సహా విద్యార్థిని తీవ్రంగా కొట్టారు.
సదరు విద్యార్థి బయటకు వెళ్లి మరికొందరితో వచ్చి హాస్టల్లో ఉన్న విద్యార్థులపై దాడి చేయించాడు. ఇక, కొన్ని వసతి గృహాలు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాలుగా మారుతున్నాయనే ఆరోపణలు కూడా వెల్లువెత్తుతున్నాయి. హాస్టళ్ల ప్రాంగణాలు, వాటి పరిసరాల్లో మద్యం సీసాలు, సిగరెట్ పీకలు, గుట్కా ప్యాకెట్లు దర్శనమిస్తున్నాయి.
బాలికల వసతి గృహాల్లో ఉంటున్న విద్యార్థినులకు రక్షణ లేకుండా పోతోంది. బాలికల హాస్టళ్లలో కొందరు విద్యార్థినులు సెల్‌ఫోన్ వినియోగిస్తుండడంతో పలువురు ఆకతాయిలు, వారి సహా విద్యార్థులు కలిసి కొందరు విద్యార్థినులకు ఫోన్లు చేస్తున్నారు. బాలికల వసతి గృహాల ముందే తిష్ట వేసి ఇతర విద్యార్థినులకు తీవ్ర అసౌకర్యం కలిగిస్తున్నారు. షాపింగ్ పేరుతో బయటకు వెళ్తున్న మరికొందరు విద్యార్థినులు సమయపాలన పాటించడం లేదు. అయినప్పటికీ వార్డెన్లు సక్రమంగా పర్యవేక్షించడం లేదు.