నమస్తే నెట్వర్క్, ఏప్రిల్ 3 : క్రీస్తు త్యాగాన్ని స్మరించుకునే రోజే గుడ్ ఫ్రైడే అని క్రైస్తవ బోధకులు, ఫాదర్లు, పాస్టర్లు పేర్కొన్నారు. శుభ శుక్రవారం సందర్భంగా ఉమ్మడి జిల్లాలోని పలు చర్చీల్లో శుక్రవారం భక్తిశ్రద్ధలతో గుడ్ ఫ్రైడే కార్యక్రమాలను జరిపారు. ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.
ఈ సందర్భంగా క్రైస్తవ బోధకులు ప్రభువు సందేశాన్ని వినిపించారు. క్షమించడంలోనే నిజమైన విజయం ఉందని క్రీస్తు చాటి చెప్పారని గుర్తుచేశారు. సర్వోన్నతుడైన దేవుడి కుమారుడు తనను తాను తగ్గించుకొని భువికి వచ్చాడని, సమస్త మానవాళి పాపపరిహారార్థమై సిలువలో బలియోగమయ్యాడని ఉపదేశించారు. కాగా, గుడ్ ఫ్రైడే సందర్భంగా పలు చర్చీల్లో క్రీస్తుకు శిలువ వేసే సన్నివేశాలను విశ్వాసులు కళ్లకు కట్టారు.