రఘునాథపాలెం, ఆగస్టు 1 : సైబర్ నేరగాళ్ల బారినపడి సొమ్ము పోగొట్టుకున్న బాధితులు(గోల్డెన్ అవర్) గంట వ్యవధిలో 1930కి కాల్ చేయడం ద్వారా దొంగిలించిన మొత్తాన్ని స్తంభింపజేసే అవకాశం ఉంటుందని పోలీస్ కమిషనర్ సునీల్‌దత్ అన్నారు. గురువారం పోలీస్ కాన్ఫరెన్స్ హాల్లో పోలీస్ అధికారులతో జరిగిన నేర సమీక్షా సమావేశంలో పోలీస్స్టేషన్ల వారీగా సైబర్ నేరాలు, ఎన్డీపీఎస్ యాక్ట్, పొక్సో కేసులు, రోడ్డు ప్రమాదాలు, గ్రేవ్ నాన్ గ్రేవ్ కేసులలో చేసిన దర్యాప్తు, విచారణ స్థితిగతులు, పెండింగ్ కేసుల పురోగతిపై సీపీ సమీక్ష జరిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సైబర్ నేరాల్లో ఫిర్యాదు చేయడం ఆలస్యమైతే నేరగాళ్లు కాజేసిన సొమ్మును వేర్వేరు అకౌంట్లకు బదిలీ చేసి దేశంలోని మారుమూల ప్రాంతాల బ్యాంకుల నుంచి డ్రా చేసుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు. తద్వారా దర్యాప్తు, రికవరీ మరింత ఆలస్యమవుతుందన్నారు. సైబర్ క్రైమ్‌కు గురైన గంటలోనే 1930కి కానీ cybercrime.gov.in కానీ ఫిర్యాదు చేయాలన్నారు. మాదక ద్రవ్యాలు సరఫరా చేసే వారిపై అత్యంత కఠినంగా వ్యవహరించాలన్నారు.
మద్యం తాగి వాహనాలు నడిపే వారిపై కేసులు నమోదు చేయాలన్నారు. ట్రాఫిక్ సమస్యల పరిష్కారం, క్రమబద్ధీకరణకు తీసుకోవాల్సిన చర్యలపై పలు సూచనలు చేశారు. కొత్త క్రిమినల్ చట్టాల అమల్లో పోలీస్ అధికారులు మరింత సమర్థవంతంగా విధులు నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. అడిషనల్ డీసీపీ లా అండ్ ఆర్డర్ ప్రసాదరావు, అడిషనల్ డీసీపీ అడ్మిన్ నరేశ్‌కుమార్, ఏసీపీలు రమణమూర్తి, తిరుపతిరెడ్డి, రెహమాన్, రఘు, శ్రీనివాసరావు, వెంకటేశ్, ప్రసన్నకుమార్, రవి, ఫణీందర్, సాంబరాజు, మల్లయ్య, భోజరాజు, సుశీల్‌సింగ్, నర్సయ్య తదితరులు పాల్గొన్నారు