భద్రాచలం, జూన్ 14 : శుక్రవారం సందర్భంగా భద్రాచలం సీతారామచంద్రస్వామి అంతరాలయంలోని మూలవరులకు బెంగుళూరు భక్తులు రూ.5 కోట్లతో తయారు చేయించి సమర్పించిన సర్వాంగ స్వర్ణ కవచాలను ధరింపజేశారు. ప్రత్యేక కవచాలంకరణలో సీతారామ, లక్ష్మణమూర్తులు మరింత రమణీయంగా భక్తులకు దర్శనమిచ్చారు. తెల్లవారుజామున స్వామివారికి సుప్రభాత సేవ, ఆరాధన, ఆరగింపు, సేవాకాలం, నిత్య హోమాలు, నిత్య బలిహరణం తదితర నిత్య పూజలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అనంతరం స్వామివారి నిత్య కల్యాణమూర్తులను బేడా మండపానికి తీసుకొచ్చి శాస్త్రోక్తంగా నిత్య కల్యాణం జరిపించారు. కల్యాణంలో పాల్గొన్న 23 జంటలకు స్వామివారి ప్రసాదాలు, శేష వస్ర్తాలను అందజేశారు.