భద్రాద్రి కొత్తగూడెం, ఫిబ్రవరి 6 (నమస్తే తెలంగాణ) : జిల్లాలో ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. అధికారికంగా నడవాల్సిన ఇసుక క్వారీలు, మన ఇసుక వాహనాలు బంద్ కావడంతో దందా అంతా కాంగ్రెస్ నాయకుల కనుసన్నల్లోనే నడుస్తోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నదులు, వాగుల్లో ఇసుక మేటలు భారీ స్థాయిలో ఉన్నా కాంగ్రెస్ ప్రభుత్వం ఇసుక తవ్వకాలు, విక్రయాలపై విధి విధానాలు రూపొందించకపోవడంతో సామాన్య, మధ్య తరగతి ప్రజలకు ఇల్లు నిర్మించుకోవాలనే కల కలగానే మిగిలిపోయే పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు ఆంధ్రా నుంచి వచ్చే ఇసుకను మనం కొనుక్కోవాల్సిన దుస్థితి ఏర్పడింది. భద్రాద్రి జిల్లాలో గతంలో 10 క్వారీలకు అనుమతులు ఉండగా.. ప్రస్తుతం 2 క్వారీలు మాత్రమే నడుస్తున్నాయి. దీంతో జిల్లా మీదుగా గోదావరి ప్రవహిస్తున్నా.. అందులోని ఇసుక మాత్రం ప్రజలకు అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. ఇటు మణుగూరు, అటు భద్రాచలం గోదావరి నది ఒడ్డున ఉండే గ్రామాల్లో సైతం ఇసుక రేటు విపరీతంగా పెరిగిపోయింది.
సామాన్యులు సైతం ఇళ్లు కట్టుకునే విధంగా గత కేసీఆర్ ప్రభుత్వం మన ఇసుక వాహనం కార్యక్రమాన్ని అందుబాటులోకి తెచ్చింది. వాగుల్లో ఏర్పాటు చేసిన ర్యాంపులతో ఆన్లైన్ ద్వారా విక్రయాలు చేపట్టే ప్రక్రియ వల్ల తక్కువ రేటుకే ఇసుక ఇంటి వద్దకు చేరేది. గతంలో జిల్లావ్యాప్తంగా 13 ఇసుక ర్యాంపులు ఉండగా.. ప్రస్తుతం ఒక్క ర్యాంపును కూడా ప్రారంభించకపోవడంతో మన ఇసుక వాహనాల అడ్రస్ కనబడేటట్లు లేదు. దీంతో ఎడ్ల బండ్లు, రాత్రుళ్లు తరలించే అక్రమ ఇసుక రవాణాతో సామాన్యులపై పెనుభారం పడుతోంది. కొత్తగూడెంలో సాటివారిగూడెం, చాతకొండ ర్యాంపులకు అనుమతులు వచ్చినా వాటిని ప్రారంభించకపోవడం వల్ల ఇసుక డిమాండ్ విపరీతంగా పెరిగింది.
పక్కనే గోదావరి నది ఉన్నా భద్రాచలం నుంచి బూర్గంపాడు మండలాల వరకు ఆంధ్రా ఇసుక దందా కొనసాగుతోంది. గతంలో రూ.వెయ్యి ఉన్న ఇసుక ట్రాక్టర్ ఇప్పుడు రూ.3వేలు పలుకుతోంది. దీనిని ఆసరాగా చేసుకున్న వ్యాపారులు ఆంధ్రా నుంచి రాత్రికి రాత్రే తరలించి జిల్లాలో విపరీతమైన రేట్లకు విక్రయిస్తున్నారు.
క్వారీలు లేకపోవడం వల్ల ఇసుక రేటు బాగా పెరిగింది. గతంలో మణుగూరులో నాలుగు క్వారీలు ఉండేవి. ఇప్పుడు ఒక్క క్వారీ మాత్రమే నడుస్తోంది. దీంతో కట్టడాలకు రేటు పెంచితే ఇంటి యజమానులు నమ్మరు. ఇసుక రేటు తగ్గితే నిర్మాణాలు చేసుకుంటారు. మధ్యతరగతి ప్రజలు ఇళ్లు కట్టుకోవాలంటే ఇసుక ధరలు తగ్గాలి. పక్కనే గోదావరి, వాగులు ఉన్నా ఇసుకకు ఇంత ధర ఉంటే ఎలా కొంటారు.
జిల్లాలో గతంలో 15 నుంచి 20 వరకు సొసైటీలు నడిచేవి. క్వారీలు కూడా 8 వరకు నడిచేవి. సొసైటీలకు ప్రభుత్వం నుంచి జిల్లావ్యాప్తంగా రూ.80కోట్ల బకాయిలు ఉన్నాయి. వారికి చెల్లింపులు జరగకపోవడం వల్ల క్వారీలు నడిచే పరిస్థితి లేదు. చర్ల, మణుగూరు మండలాల్లో క్వారీలు నడుస్తున్నాయి. మన వాహనాలను వారంలో ప్రారంభించే అవకాశం ఉన్నది.