భద్రాచలంలో గోదావరి వరద డేంజర్ బెల్స్ మోగించినా అమాత్యులు మాత్రం ఆచూకీ లేకుండా పోయారు. పరీవాహక ప్రాంతాలన్నీ నీట మునుగుతున్నా, ఎక్కడికక్కడ రాకపోకలు నిలిచిపోతున్నా.. వారు మాత్రం నగరాలు, పట్టణాలను వీడడం లేదు. లోతట్టు ప్రాంతాల్లో పర్యటించిందీ లేదు. వరద చుట్టుముట్టకముందే అక్కడి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించిందీ లేదు. పునరావాస కేంద్రాల ఏర్పాట్లు, వాటిల్లో సౌకర్యాల కల్పన, బఫర్ స్టాక్ సన్నద్ధత వంటి ముందస్తు ఏర్పాట్లలో ఏ ఒక్కటి చేసింది లేదు. దీంతో తమవైపు ముంచుకొస్తున్న వరద నుంచి తమను కాపాడే అమాత్యుల కోసం ముంపు ప్రాంతాల ప్రజలు ఎదురుచూస్తున్నారు. ఇదే క్రమంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో.. వరదల సమయానికి నెలల ముందుగానే సమీక్షలు పెట్టి, వరదలు మొదలవగానే ఆపన్నహస్తాలు అందించిన అమాత్యులను గుర్తు చేసుకుంటున్నారు.
-భద్రాద్రి కొత్తగూడెం, నమస్తే తెలంగాణ/ భద్రాచలం, ఆగస్టు 21
ఉమ్మడి ఖమ్మం జిల్లాకు ముగ్గురు మంత్రులున్నప్పటికీ గోదావరి పరీవాహక ప్రజలకు పెద్దగా ప్రయోజనం లేకుండా పోతోంది. వరదలు ఉగ్రరూపం దాల్చుతున్న వేళ కనీసం ఇటువైపు తొంగి చూసిన అమాత్యుడు లేడంటే అతిశయోక్తి లేనేలేదు. కనీసం.. అటు అధికారులను, ఇటు ప్రజలను అప్రమత్తం చేసిన పాపానపోలేదు. ఒకవేళ రాత్రికి రాత్రి వరద తీవ్ర పెరిగితే లోతట్టు ప్రాంతాల ప్రజలకు హాహాకారాలు తప్పేలా లేవు. ప్రజలు ఆపదలో ఉన్న వేళ అమాత్యులు రంగంలోకి దిగి సహాయక చర్యలకు శ్రీకారం చుట్టేందుకూ అతీగతీ లేదు. ఎగువన కురిసిన భారీ వర్షాల వల్ల భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. గోదావరికి కుడివైపుగా ఎగువనున్న మణుగూరు, మధ్యనున్న అశ్వాపురం, దిగువనున్న బూర్గంపహాడ్ వరకూ, అదే గోదావరి ఎడమవైపుగా ఎగువనున్న చర్ల, మధ్యనున్న దుమ్ముగూడెం, దిగువనున్న భద్రాచలం వరకూ పరీవాహకంలోని లోతట్టు ప్రాంతాలన్నీ నీటమునుగుతూ వస్తున్నాయి.
చర్ల, దుమ్ముగూడెం, అశ్వాపురం, బూర్గంపహాడ్ మండలాల్లో వాగులు పోటెత్తడం, వరద ఊళ్లలోకి రావడం, రహదారులపై చేరడం వంటి కారణాలతో ఆయా గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. మరోవైపు భద్రాచలం వద్ద గోదావరి ప్రవాహం రెండు రోజుల క్రితమే మొదటి ప్రమాద హెచ్చరికను దాటింది. బుధవారం రాత్రి రెండో ప్రమాద హెచ్చరికను దాటింది. గురువారం సాయంత్రానికి మూడో ప్రమాద హెచ్చరికకు చేరువైంది. దీంతో పరీవాహకంలోని లోతట్టు ప్రాంతాల ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. ఈ క్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు స్పందించి అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి ప్రాణ, ఆస్తి నష్టాలు జరుగకుండా చర్యలు చేపట్టాల్సి ఉంది.
కానీ, ఇంత వరకూ ముంపు ప్రజలకు వారు ఎలాంటి జాగ్రత్తలూ చెప్పకపోవడం గమనార్హం. కేవలం అధికారులే కొన్ని ప్రాంతాల్లో పర్యటించి ముంపు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. అయితే, మూడో ప్రమాద హెచ్చరిక వద్ద గోదావరి ప్రవాహం ఉన్నప్పటికీ.. మంత్రులు రాకపోవడం, స్థానిక ఎమ్మెల్యేలు జాడలేకపోవడం గమనార్హం. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మొదటి ప్రమాద హెచ్చరిక సమయానికే ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన అప్పటి మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్.. భద్రాచలంలో మకాం వేసేవారు. నిరంతరం అధికారులను అప్రమత్తం చేస్తూ వరద సహాయక చర్యలను పర్యవేక్షించేవారు. వరదలు తగ్గే వరకూ ఇక్కడే ఉంటూ, పరిస్థితిని ఎప్పటికప్పుడు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి అవసరమైన సహాయాన్ని పొందేవారు. కానీ, ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో అలాంటి చర్యలేమీ లేకపోవడంతో ముంపు ప్రాంతాల ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు.