మామిళ్లగూడెం, జనవరి 20: యువత మానసిక బలహీనతలను ఆసరాగా చేసుకున్న గంజాయి విక్రయంతోపాటు వినియోగానికి పురిగొల్పుతున్న ముఠాను ఖమ్మం టూటౌన్ పోలీసులు, టాస్క్ఫోర్సు పోలీసులు పక్కా సమాచారంతో పట్టుకున్నట్లు ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్‌దత్ తెలిపారు. నగరంలోని తన కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆ వివరాలు వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం.. వైరా సంతబజార్‌కు చెందిన సిరిగిరి సురేశ్ అలియాస్ సంజయ్, ఏపీ కృష్ణా జిల్లా విసన్నపేటకు చెందిన జీవన్ అనే యువకులు కలిసి 2022 నుంచి గంజాయి విక్రయిస్తున్నారు. వొడాఫోన్ సంస్థలో సేల్స్‌మెన్‌గా పనిచేస్తున్న సురేశ్ మరికొందరితో పరిచయం పెంచుకొని గంజాయి విక్రయించేందుకు, వినియోగించేందుకు ముఠాగా ఏర్పాటు చేసుకున్నారు. వీరు ఆంధ్రప్రదేశ్, ఒడిశా సరిహద్దులోని చిత్రకొండ ప్రాంతం నుంచి గంజాయిని కొనుగోలు చేసి ఖమ్మం, హైదరాబాద్ నగరాల్లో విక్రయిస్తున్నారు.
వీరికి ఏపీలోని కృష్ణా జిల్లా గంపలగూడెం మండలం నెమలి గ్రామానికి చెందిన మునుబోలు ఏడుకొండలు గుణశేఖర్, వైరా ఫిష్కాలనికి చెందిన కండ్ర సతీశ్, వైరా మండలం ముసలిమడుగు గ్రామానికి చెంది హైదరాబాద్‌లో ప్రైవేటు ఉద్యోగం చేస్తున్న కరకాని ఇంద్రసేన గోపి, ఖమ్మం గోపాలపురం ప్రాంతానికి చెందిన బీ.రమేశ్, పొదిలి జశ్వంత్, కోణిజర్ల గ్రామానికి చెందిన కోమటి సురేశ్ సహకారం అందిస్తున్నారు. దీంతో వారు ఖమ్మంలోని విద్యార్థులు, యువతకు గంజాయిని విక్రయిస్తున్నారు. కాగా, పక్కా సమాచారం మేరకు ఖమ్మం టూటౌన్, టాస్క్ఫోర్సు పోలీసులు వీరి కదలికలపై నిఘా పెట్టి ఉంచారు. ఈ ముఠాలోని ఏడుగురిని తాజాగా అరెస్టు చేసి వారి నుంచి సుమారు రూ.2 లక్షల విలువైన 8 కేజీల గంజాయి, 7 సెల్ఫోన్లు, ఒక బైక్ స్వాధీనం చేసుకున్నారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారు.
ఈ ముఠా నుంచి గంజాయిని కొనుగోలు చేసి చిన్న చిన్న ప్యాకెట్లుగా తయారు చేసి విక్రయిస్తున్న, వినియోగిస్తున్న మరో 15 మందిని గుర్తించారు. ఈ ముఠా ద్వారా లావాదేవీలు నిర్వహిస్తున్న ఖమ్మం, పరిసర ప్రాంతాలకు చెందిన వారిలో చరణ్, లిఖిత్, సందీప్, రాహుల్, ఏ.రాజు, చరణ్, పవన్, భువన్, వంశీ, ప్రవీన్, మిక్కీ, సాయి, గోపి, లోకిత్, వివేక్ అనే యువకులను గుర్తించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. వీరితోపాటు మరికొందరు కూడా ఉన్నందున వారిని కూడా త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు. అయితే పిల్లలు గంజాయి బారిన పడినట్లుగా తల్లిదండ్రులు గుర్తిస్తే వెంటనే రిహాబిలేషన్ సెంటర్‌కు తరలించాలని సూచించారు. అలాగే, గంజాయి వంటి మాదకద్రవ్యాలు విక్రయించినా, వినియోగించినా సహించబోమని స్పష్టం చేశారు. ఏసీపీలు హరికృష్ణ, శివరామయ్య, సీఐ కుమారస్వామి పాల్గొన్నారు.