వాడవాడలా గణనాథుల సందడి నెలకొంది. అదిరిపోయే సెట్టింగ్‌లు, విద్యుత్ కాంతులతో మండపాలు జిగేల్మంటున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లావ్యాప్తంగా బుధవారం వినాయక చవితి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించుకున్నారు. మండపాల్లో గణనాథుల ప్రతిమలకు ప్రత్యేక పూజలు చేసి నవరాత్రి ఉత్సవాలను ప్రారంభించారు. పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నియంత్రణకు పలువురు స్వచ్ఛందంగా మట్టి విగ్రహాలను పంపిణీ చేశారు. ఖమ్మంలో సుమారు 20 వేల మట్టి ప్రతిమలను ఉచితంగా పంపిణీ చేశారు. నగరంలోని బ్రాహ్మణబజారు శివాలయం సెంటర్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన 27 అడుగుల భారీ కాలసర్ప నీలకంఠ మట్టి గణపతి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఖమ్మం కల్చరల్ సెప్టెంబర్ 1 : ఉమ్మడి జిల్లావ్యాప్తంగా బుధవారం వినాయక చవితి వేడుకలను వైభవంగా నిర్వహించుకున్నారు. మండపాల్లో వినాయక విగ్రహాలను శాస్ర్తోక్తంగా ప్రతిష్ఠించి నవరాత్రి ఉత్సవాలను ప్రారంభించారు. గజ వాహనుడైన గణపతి, పార్వతి పరమేశ్వరుడు, లక్ష్మీసహిత బహుముఖ గణపతి, షిర్డీసాయిగా, శక్తిస్వరూపుడిగా, త్రిశూలం, ఖడ్గధారిగా, శేషపడగలతో, సింహాధీశుడిగా, హరిత ఏకదంతుడిగా, సరస్వతి, లక్ష్మీదేవి సమేతుడిగా అనేక రూపాల్లో వినాయకులు మండపాల్లో దర్శనమిచ్చారు. భక్తులు నృత్యాలు చేస్తూ, గణేశుడికి జై కొడుతూ వాహనాల్లో విగ్రహాలను మండపాలకు తరలించారు. మేళతాళాలు, వేద మంత్రోచ్ఛారణలు, భజనలు, కీర్తనల నడుమ గణనాథులు మండపాల్లో కొలువుతీరారు. ఈ సారి వాడవాడలా అధికసంఖ్యలో భారీ విగ్రహాలను ప్రతిష్ఠించారు. పర్యావరణాన్ని పరిరిక్షించేందుకు, కాలుష్య నియంత్రణకు ఈ సారి స్వచ్ఛంద సంస్థలు మట్టి విగ్రహాలను పంపిణీ చేశాయి. అనేక మండపాల్లో మట్టి విగ్రహాలు దర్శనమిచ్చాయి. ఖమ్మంలో సుమారు 20 వేల మట్టి ప్రతిమలు, విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేశారు.
రాష్ట్రంలోనే రెండో అతిపెద్ద మట్టి విగ్రహం..
బ్రాహ్మణబజార్ శివాలయం సెంటర్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన 27 అడుగుల భారీ కాలసర్ప నీలకంఠ మట్టి గణపతి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రాష్ట్రంలోనే రెండో అతిపెద్ద మట్టి విగ్రహం కావడం విశేషం. కొద్ది నిమిషాల్లోనే ఈ విగ్రహం నీటిలో కరిగిపోతుందని నిర్వాహకుడు సాయికిరణ్ తెలిపారు. ఏటా ఇక్కడ ఒక ప్రత్యేకతతో భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. 24 సర్పాలతో భారీ సెట్టింగ్‌తో ఆకర్షణీయంగా ఉన్న నీలకంఠ గణేశుడిని అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకుని పూజలు చేశారు. ఆయా ప్రాంతాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు పలు మండపాల వద్ద వినాయకుడిని దర్శించుకుని పూజలు చేశారు.
రాపర్తినగర్లో..
నగరంలోని 58వ డివిజన్ రాపర్తినగర్-2లో శ్రీగణేశ్ ఉత్సవ కమిటీ, భక్త బృందం ఆధ్వర్యంలో భారీ వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేసి పూజలు చేశారు. భక్తులు వల్లభనేని సత్యనారాయణ సుజాత దంపతుల సౌజన్యంతో విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. కమిటీ సభ్యులు శెట్టి రంగారావు, తాళ్లూరి సోమయ్య, చిలక కోటయ్య, ఆకుతోట ఉపేందర్, ఎస్వీ చారి, సుంకర నాగరాజు, బానోతు బావ్‌సింగ్, పోట్ల నాగేశ్వరరావు, పోట్ల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
విద్యానగర్‌లో విగ్రహదాతలుగా ముస్లిం భక్తులు..
మత సామరస్యానికి ప్రతీకగా వినాయక నవరాత్రి ఉత్సవాలు కొనసాగుతున్నాయి. నగరంలోని 1వ డివిజన్ విద్యానగర్‌లో ముస్లిం భక్తులు వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేసి పూజలు చేసి మత సామరస్యాన్ని చాటారు. విద్యానగర్ గణేశ్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ముస్లిం భక్తులు షేక్లాల్సాహెబ్ మస్తాన్‌బీ దంపతులు వినాయక మట్టి విగ్రహాన్ని అందజేశారు. ముస్లిం భక్తులు ముందుకొచ్చి విగ్రహాన్ని ఇవ్వడం అభినందనీయమని నిర్వాహకులు గుర్రం హరనాథ్ పేర్కొన్నారు. ఉత్సవ కమిటీ సభ్యులు గుర్రం హరనాథ్, యల్లంపల్లి చంద్రశేఖర్, యమసాని మనోజ్‌కుమార్, మద్దినేని వెంకటేశ్వరరావు, పట్టాభి రామారావు, జవ్వాది రాములు పాల్గొన్నారు. నగరంలోని గాంధీచౌక్ విజయగణపతి దేవస్థానంలో, కమాన్‌బజార్, రాపర్తినగర్, విద్యానగర్, మధురానగర్, చైతన్యనగర్, రోటరీనగర్, మామిళ్లగూడెం, బుర్హాన్‌పురంలో మండపాల్లో చవితి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు.
మంత్రి దంపతుల పూజలు
ఖమ్మం సెప్టెంబర్ : హైదరాబాద్‌లోని తన నివాసంలో రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, వసంతలక్ష్మి దంపతులు, డాక్టర్ నయన్రాజు, అపర్ణ దంపతులు వినాయక చవితి వేడుకలు నిర్వహించారు. మట్టి గణనాథుడిని ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు చేశారు. మట్టి గణపతిని పూజించి పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని మంత్రి పిలుపునిచ్చారు.