జూలూరుపాడు, నవంబర్ 22: సీఎం కేసీఆర్ ఆశీస్సులతో పోటీ చేస్తున్న తనను గెలిపిస్తే నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతానని బీఆర్ఎస్ వైరా నియోజకవర్గ అభ్యర్థి బానోత్ మదన్‌లాల్ పేర్కొన్నారు. ఉద్యమ సారథి, ముఖ్యమంత్రి కేసీఆర్‌తోనే బంగారు తెలంగాణ సాధ్యమని స్పష్టం చేశారు. ఆయన సారథ్యంలోని బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మరోసారి గెలిపిస్తే వైరా నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని అన్నారు. జూలూరుపాడు మండలంలో బుధవారం పర్యటించిన ఆయన.. బేతాళపాడు, పంతులుతండా, టాక్యాతండా, పీక్లాతండా, చీపురుగూడెం, రేగళ్లతండా గ్రామాల్లో రాత్రి 8 గంటల వరకు విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామాల పర్యటనకు వెళ్లిన మదన్‌లాల్‌కు ఆయా గ్రామాల మహిళలు హారతులు ఇచ్చి, నుదుటున కుంకుమ దిద్ది ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా మదన్‌లాల్ మాట్లాడుతూ.. తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు మారుమూల గ్రామాల్లోని ప్రజలకూ అందజేశానని అన్నారు. ఇప్పుడు మరోమారు తనను ఆశీర్వదించి గెలిపిస్తే నియోజకవర్గాన్ని అదే మారుమూల గ్రామాలకు మౌలిక సదుపాయాలు కల్పిస్తామని, వైరాను రాష్ట్రంలోనే మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దామని అన్నారు. పేదలకు డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇచ్చిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. మరోసారి అధికారంలోకి వచ్చిన వెంటనే బీఆర్ఎస్ నూతన మ్యానిఫెస్టోను అమలు చేస్తామని అన్నారు. అందుకని ప్రజలందరూ బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పటికే చేసిన అభివృద్ధిని గమనించి కారు గుర్తు ఓటు వేయాలని కోరారు. బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.