ఖమ్మం వ్యవసాయం, జూలై 21 : జిల్లాలో ఉద్యాన పంటలు సాగు చేసే రైతులకు తెలంగాణ ప్రభుత్వం ఉపాధిహామీ పథకం ద్వారా ఊతమివ్వనున్నది. మూడేళ్లపాటు నిర్వహణ ఖర్చులు భరిస్తూ.. సాగు రైతులకు బిందుసేద్యం పరికరాలను రాయితీపై అందించనున్నది. నీటి వనరులు సమృద్ధిగా ఉండడం.. వరి పంటకు బదులు ప్రత్యామ్నాయంగా పండ్లు, కూరగాయల తోటల సాగును ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా కూరగాయలు, పండ్ల ఉత్పత్తులు లేకపోవడం.. ఇతర ప్రాంతాల నుంచి ఎక్కువగా దిగుమతి చేసుకుంటుండడంతో ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. దీంతో సామాన్యులు కొని.. తినలేని పరిస్థితి ఏర్పడింది. అందుకే ఉద్యాన పంటల సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కంకణం కట్టుకున్నది. మహాత్మాగాంధీ జాతీయ ఉపాధిహామీ పథకంతో ఉద్యాన శాఖను అనుసంధానం చేస్తూ ఉద్యాన రైతులను ప్రోత్సహించడానికి రాయితీలు ప్రకటించింది. ఉపాధిహామీ పథకంలో జాబ్‌కార్డు ఉన్న షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు, సన్న, చిన్నకారు రైతులందరూ ఈ పథకానికి అర్హులవుతారు. బోరు లేదా బావినీటి వసతితోపాటు ఐదెకరాలలోపు భూమి కలిగిన రైతులకు ఈ పథకం వర్తించనుంది.
మూడేళ్లపాటు సంరక్షణ బాధ్యత
రైతులు సాగు చేయనున్న పండ్ల తోటల సంరక్షణ బాధ్యతను ప్రభుత్వం మూడేళ్లపాటు తీసుకుంటుంది. రైతులు మొక్క లు కొనేందుకు.. ఒక్కో మామిడి మొక్కకు రూ.30, బత్తాయి రూ.44, నిమ్మ రూ.25, సపోట రూ.37, జీడిమామిడి రూ.24, సీతాఫలం రూ.26, దానిమ్మ రూ.24, కొబ్బరి రూ.36, మునగ రూ.15, అల్లనేరేడు మొక్కకు రూ.25 చొప్పున ప్రభుత్వం చెల్లించనున్నది. ఎరువుల యాజమాన్యం నిమిత్తం ఒక్కో మొక్కకు రూ.50, నిర్వహణ ఖర్చుల కోసం నెలకు రూ.10 చొప్పున బతికున్న ప్రతి మొక్కకు చెల్లిస్తారు. వీటితోపాటు ఉపాధిహామీ కూలీలతో గుంతల తవ్వకం, మొక్కలు నాటే పనులు చేపట్టనున్నారు. మొక్కలు నాటిన ఏడాది నుంచి మూడేళ్లపాటు నిర్వహణ ఖర్చులు మంజూరు చేస్తారు.
రాయితీపై బిందుసేద్యం పరికరాలు
ఉపాధిహామీ పథకం ద్వారా పండ్ల తోటల సాగు చేపట్టే రైతులకు రాయితీపై బిందుసేద్యం పరికరాలు అందజేస్తారు. ఉపాధిహామీ జాబ్‌కార్డు కలిగి ఉండి.. ఐదెకరాలలోపు భూమి కలిగిన రైతులకు ఈ పథకం వర్తిస్తుంది. ముఖ్యంగా సాగునీటి వసతి కలిగి ఉండాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ రైతులకు వంద శాతం, సన్న, చిన్నకారు రైతులకు 90 శాతం రాయితీపై బిందుసేద్యం పరికరాలు అందజేయనున్నారు.
రైతులు సంప్రదించొచ్చు
ఉపాధిహామీ పథకం ద్వారా పండ్ల తోటల సాగు చేపట్టాలనుకున్న రైతులు వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారులను సంప్రదించాలి. ప్రతి నియోజకవర్గానికి ఒక ఉద్యాన శాఖ అధికారి అందుబాటులో ఉన్నారు. వీరితోపాటు ఆయా గ్రామాల్లో వ్యవసాయ శాఖ విస్తరణ అధికారి(ఏఈవో)లను సైతం పూర్తి వివరాలకు సంప్రదించొచ్చు. ఇంకా ఉపాధిహామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్లను సంప్రదించినైట్లెతే పూర్తి వివరాలు తెలియజేస్తారు. పండ్లు, కూరగాయల తోటల సాగు ద్వారా రైతులు ఆశించిన లాభాలు పొందాలన్నదే ప్రభుత్వ ఆశయం.
–జీ.అనసూయ, జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ అధికారి