ఖమ్మం రూరల్, నవంబర్ 21 : జైళ్లు ఒకప్పటి మాదిరి కాకుండా నేరప్రవృత్తి గల ముద్దాయిలను సమాజానికి ఉపయోగపడే మనుషులుగా మార్చే ఆశ్రమాలుగా మారాయని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి చంద్రశేఖర్, ఎక్సైజ్ శాఖ అసిస్టెంట్ కమిషనర్ గణేశ్‌లు అన్నారు. గురువారం దానవాయిగూడెంలోని ఓ ఫంక్షన్ హాల్లో జైళ ్లశాఖ సిబ్బంది కోసం ఏర్పాటు చేసిన రీ ట్రీట్-2024 రెండో రోజు ముగింపు కార్యక్రమం జిల్లా జైలు పర్యవేక్షణాధికారి శ్రీధర్ ఆధ్వర్యంలో జరిగింది. తొలుత జైలర్ జైలులోని ఖైదీల గురించి తీసుకుంటున్న రోజువారీ చర్యల గురించి వివరించారు.
అనంతరం లీగల్ సెల్ సెక్రటరీ మాట్లాడుతూ న్యాయ వ్యవస్థ ద్వారా సేవలు ఏ విధంగా పొందవచ్చు, ఉచిత న్యాయ సేవల గురించి వివరించారు. రీ ట్రీట్ ద్వారా సిబ్బందిలో కొత్త ఉత్సాహం తీసుకురావడంతోపాటు సిబ్బంది పడుతున్న ఇబ్బందులు, వారు ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా అధికారులతో చర్చించి పరిష్కరించుకునే అవకాశం కలుగుతుందన్నారు. జైళ్ల శాఖ, న్యాయ శాఖ రెండూ సమన్వయంతో కలిసి అందిస్తున్న సేవలు ఎంతో అమూల్యమైనవని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా జైలు సబ్ అధికారి విజయ్ డేవిడ్, జైలు అధికారి వెంకటేశ్వర్లు, జైలర్లు సకృనాయక్, జి.లక్ష్మీనారాయణ, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.