ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గురువారం జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో నలుగురు మృతిచెందారు. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు, ట్రాక్టర్ కిందపడి చిన్నారి, రైలుకింద పడి వ్యక్తి మృతిచెందారు.
పినపాక, డిసెంబర్ 8: ద్విచక్రవాహనాన్ని లారీ ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందిన ఘటన అఖినేపల్లి మల్లారంలో చోటుచేసుకున్నది. ఈబయ్యారం సీఐ రాజగోపాల్ తెలిపిన వివరాల ప్రకారం.. అశ్వాపురం మండలం గొందిగూడేనికి చెందిన పిట్ట వెంకటసాయిరెడ్డి (20), భద్రాచలంలోని ఆదర్శనగర్కు చెందిన పిట్ట వీరరాజరెడ్డి (50) బంధువులు. గురువారం వీరిద్దరూ పని నిమిత్తం ద్విచక్రవాహనంపై ములుగు జిల్లా వాజేడు మండలంలోని పేరూరుకు వెళ్లారు. తిరిగి గొందిగూడేనికి వస్తుండగా అఖినేపల్లి మల్లారం సమీపంలో వీరి ద్విచక్రవాహనాన్ని వేగంగా వస్తున్న లారీ ఢీకొట్టింది. ఘటనలో వీరరాజరెడ్డి, వెంకటసాయిరెడ్డి తీవ్రగాయాల పాలై అక్కడికక్కడే మృతిచెందారు. లారీ డ్రైవర్ వాహనాన్ని ఆపకుండానే అక్కడి నుంచి పరారయ్యాడు. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతిచెందిన విషయం తెలుసుకున్న ప్రభుత్వ విప్ రేగా కాంతారావు హుటాహుటిన ఘటనా స్థలానికి వచ్చారు. మృతుల కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఘటన జరిగిన తీరును పోలీసులతో మాట్లాడి తెలుసుకున్నారు. మణుగూరు డీఎస్పీ రాఘవేంద్రరావు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాలను పోస్ట్మార్టం నిమిత్తం మణుగూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
అన్నపురెడ్డిపల్లి, డిసెంబర్8: ట్రాక్టర్ కింద పడి ఓ చిన్నారి మృతిచెందిన ఘటన పెంట్లం గ్రామంలో చోటుచేసుకున్నది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మాందాసు గోపి, జ్యోతి దంపతుల చిన్న కుమారుడు శశిప్రణవ్(4) గురువారం సాయంత్రం రోడ్డు ప్రక్కన ఆడుకుంటున్నాడు. ఈ క్రమంలో అటుగా వచ్చిన ట్రాక్టర్ ప్రమాదవశాత్తు చిన్నారిపై నుంచి వెళ్లింది. ఘటనలో తీవ్ర గాయాలపాలైన చిన్నారి అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చిన్నారి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
ఎర్రుపాలెం, డిసెంబర్ 8: ఎర్రుపాలెం- గంగినేని రైల్వేస్టేషన్ల మధ్య రైలుపట్టాపై గురువారం రైల్వేశాఖ సిబ్బంది గుర్తుతెలియని మృతదేహాన్ని గుర్తించారు. రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటనా స్థలాన్ని చేరుకుని పంచనామా నిర్వహించారు. మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం మధిర ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదవశాత్తు రైలు కిందపడి మృతిచెంది ఉంటాడని రైల్వేపోలీసులు భావిస్తున్నారు. మృతుడి వయస్సు సుమారు 40 ఏళ్లు ఉంటుందని, వివరాలు తెలిసిన వారు 99636 41484, 94407 00041 నంబర్లలో సంప్రదించాలని ఖమ్మం జీఆర్పీ ఎస్సై భాస్కర్రావు తెలిపారు.