చింతకాని, మార్చి 10: మహిళల ఆర్థికాభివృద్ధే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క అన్నారు. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి అనంతరం చింతకాని మండలం ప్రొద్దుటూరు రైతువేదికలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. రానున్న ఐదేళ్లలో డ్వాక్రా సంఘాలకు రూ.లక్ష కోట్ల రుణాలు అందిస్తామన్నారు. వడ్డీ లేని రుణాల పంపిణీని ఈ నెల 12న ప్రారంభిస్తామన్నారు. మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు చేయూతనిస్తామన్నారు. అలాగే ప్రతి నియోజకవర్గంలో 3,500 ఇండ్లు నిర్మిస్తామని, ఒక్కో ఇంటి యజమానికి రూ.5 లక్షల సాయం అందిస్తామన్నారు. సమావేశంలో వైరా ఎమ్మెల్యే రాందాస్‌నాయక్, ఎంపీపీ కోపూరి పూర్ణయ్య, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, నాయకులు దుర్గాప్రసాద్, కిలారు మనోహర్‌బాబు, కొప్పుల గోవిందరావు, కిశోర్, వెంకటేశ్వర్లు, జావిద్ పాల్గొన్నారు.
బోనకల్లు, ముదిగొండ,చింతకాని మండలాల్లో..
బోనకల్లు మండలంలోని లక్ష్మీపురం, కలకోట, ఆళ్లపాడు గ్రామంలో ఆదివారం డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క పర్యటించారు. లక్ష్మీపురం- పాతర్లపాడు వరకు రూ.27 కోట్లతో నిర్మించనున్న బీటీ రోడ్డు, ఆళ్లపాడు -గోవిందాపురం వరకు రూ.28, కోట్లతో నిర్మించనున్న రోడ్డు, కలకోట -నారాయణపురం వరకు రూ.85 లక్షలతో నిర్మించనున్న బీటీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. లక్ష్మీపురంలో నూతన పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీపీ కంకణాల సౌభాగ్యం, జడ్పీటీసీ మోదుగుల సుధీర్‌బాబు ఉన్నారు. ముదిగొండ మండలంలోని వనంవారి కిష్టాపురంలో బీటీ రోడ్డు, వనంవారి కిష్టాపురం- జగన్నాథపురం ఆర్అండ్బీ రోడ్డు విస్తరణ పనులకు శంకుస్థాపన చేశారు. చింతకాని మండలంలో ప్రొద్దుటూరు- పాతర్లపాడు, లచ్చగూడెం- రాఘవాపురం, రాఘవాపురం- అల్లీపురం, రాఘవాపురం-స్టేడియం రోడ్‌కు శంకుస్థాపన చేశారు. లచ్చగూడెంలో డబుల్ బెడ్ రూం నిర్మాణాలను పరిశీలించారు. ఇంటిగ్రేటెడ్ మోడల్ పాఠశాల ఏర్పాటుకు ప్రతిపాదిత స్థలాన్ని పరిశీలించారు. డిప్యూటీ సీఎం వెంట కలెక్టర్ వీపీ గౌతమ్, వైరా ఎమ్మెల్యే రాందాస్‌నాయక్, అడిషనల్ కలెక్టర్ మధుసూదన్‌నాయక్, ఆర్డీవో గణేష్, తహసీల్దార్ రమేశ్, ఎంపీడీవో రామయ్య పాల్గొన్నారు.