మధిర, నవంబర్ 9 : మధిర ప్రాంతంలో ఎడ్ల బండ్లతో ఇసుక తోలకాలను అధికారులు అడ్డుకోవడం సరికాదని, వారికి అనుమతి ఇవ్వాలని జడ్పీ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ పార్టీ మధిర నియోజకవర్గ ఇన్చార్జి లింగాల కమల్‌రాజు డిమాండ్ చేశారు. శనివారం మధిర ప్రాంతంలో ఇసుక తోలుతున్న ఎడ్ల బండ్ల కార్మికులను అధికారులు అడ్డుకున్నారు. దీంతో విషయం తెలుసుకున్న కమల్‌రాజు.. బీఆర్ఎస్ శ్రేణులతో వెళ్లి వారికి మద్దతుగా నిలిచారు. తహసీల్దార్, సీఐతో మాట్లాడి వారి సమస్యను తక్షణమే పరిష్కరించాలని కోరారు.
ఎడ్ల బండ్ల ద్వారా ఇసుక తోలకాలకు ఉమ్మడి రాష్ట్రంలోనే అనుమతి ఇస్తూ అప్పటి ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్‌రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఇచ్చిన జీవో విషయాన్ని గుర్తు చేస్తూ జీవో కాపీలను అధికారులకు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక అవసరాలకు ఎడ్ల బండ్ల ద్వారా ఇసుక తోలడం నేరమా.. అని ప్రశ్నించారు. తక్షణమే ఇసుక తోలకాలను అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట మధిర సహకార సంఘం అధ్యక్షుడు బిక్కి కృష్ణప్రసాద్, మార్కెట్ మాజీ చైర్మన్ చిత్తారు నాగేశ్వరరావు, మండల, పట్టణ పార్టీ కార్యదర్శులు అరిగే శ్రీనివాసరావు, బొగ్గుల భాస్కర్‌రెడ్డి, కౌన్సిలర్లు యన్నంశెట్టి అప్పారావు, ఇక్బాల్, నాయకులు ఆళ్ల నాగబాబు, జేవీ రెడ్డి, కపిలవాయి జగన్మోహన్రావు, జగన్నాథాచారి, పరిష శ్రీనివాసరావు, చిదిరాల రాంబాబు తదితరులు ఉన్నారు.