కొత్తగూడెం అర్బన్, సెప్టెంబర్ 13: బీఆర్ఎస్కు ప్రజల్లో వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేకనే కాంగ్రెస్ ప్రభుత్వం చిల్లర రాజకీయాలు చేస్తోందని కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు విమర్శించారు. ఎన్నికల హామీలను అమలు చేయడం చేతగాక దాడుల సంస్కృతిని ప్రోత్సహిస్తోందని మండిపడ్డారు. కొత్తగూడెంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
అధికార మదం, అంగ బలంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి ఇంటిపై కాంగ్రెస్ గూండాలు దాడి చేసి హత్యాయత్నానికి యత్నించడం సిగ్గుచేటని అన్నారు. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఈ దాడులకు సీఎం రేవంత్‌రెడ్డి పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. కౌశిక్‌రెడ్డిని పరామర్శించడానికి వెళ్లిన మాజీ మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు, ఇతర నాయకులను అక్రమంగా అరెస్టు చేయడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు.
మున్సిపల్ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి, వైస్ చైర్మన్ వేల్పుల దామోదర్, కౌన్సిలర్లు రక్మాంగధర్, వేల్పుల ప్రసాద్, అంబుల వేణుగోపాల్, బీఆర్ఎస్ నాయకులు భూక్యా సోన, కొల్లు పద్మ, బత్తుల వీరయ్య, మంతపురి రాజుగౌడ్, కొట్టి వెంకటేశ్వర్లు, సబ్బారపు నాగేందర్, కాంపెల్లి కనకేశ్, మైనార్టీ సంఘం నాయకులు అన్వర్‌పాషా, సయ్యద్ హైమద్, టీబీజీకేఎస్ రాష్ట్ర నాయకుడు కూసన వీరభద్రం తదితరులు పాల్గొన్నారు.