కొత్తగూడెం అర్బన్, మే 19: ఖమ్మం – నల్గొండ – వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేశ్‌రెడ్డిని గెలిపించుకుందామని కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు. కొత్తగూడెంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి రాకేశ్‌రెడ్డి గెలుపు కోసం ప్రచారం నిర్వహించేందుకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ సోమవారం కొత్తగూడేనికి రానున్నట్లు చెప్పారు.
ఆ రోజు ఉదయం 9 గంటలకు కొత్తగూడెం క్లబ్లో నిర్వహించనున్న సమావేశానికి పట్టభద్రులు తరలిరావాలని కోరారు. అలవిగాని, ఆచరణకు సాధ్యంకాని హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్.. ఇప్పుడు ఆ వాగ్దానాలను తుంగలో తొక్కిందని విమర్శించారు. రాష్ట్రంలో ప్రస్తుతం కరువు పరిస్థితులు నెలకొన్నాయని, రైతులందరూ ఆందోళన చెందుతున్నారని అన్నారు. కాంగ్రెస్‌కు ఓటు వేసినందుకు ప్రతి ఒక్కరూ బాధపడుతున్నారని అన్నారు. రుణమాఫీ గురించి అడిగితే సీఎం రేవంత్‌రెడ్డి దేవుళ్ల మీద ఒట్లు వేస్తున్నారని విమర్శించారు. ఎన్నికలప్పుడు ఒకమాట, ఎన్నికలయ్యాక మరోమాట మాట్లాడుతూ ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు.
మళ్లీ సీఎంగా కేసీఆర్ రావాలని, బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటుకావాలని రాష్ట్రంలోని మహిళలు, యువకులు, విద్యార్థులు, ఉద్యోగులతోపాటు అన్ని వర్గాల ప్రజలూ కోరుకుంటున్నారని అన్నారు. పట్టభద్రులు విజ్ఞతతో ఆలోచించి ఓటు వేయాలని, బీఆర్ఎస్ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ప్రశ్నించే గొంతు మండలిలో ఉండాలని, పట్టభద్రుల సమస్యలను పరిష్కరించగలిగే సత్తా రాకేశ్‌రెడ్డికే ఉందని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు కాపు సీతాలక్ష్మి, బాదావత్ శాంతి, భూక్యా సోన, వేల్పుల దామోదర్, బండి నర్సింహారావు, వేముల ప్రసాద్‌బాబు, అంబుల వేణుగోపాల్, కొట్టే వెంకటేశ్వరరావు, కూరపాటి సుధాకర్, మోరె భాస్కర్‌రావు, కనుకుంట్ల శ్రీను, కోసున వాసు, అన్వర్‌పాషా, యాకూబ్, బొమ్మిడి శ్రీకాంత్, విజయ్ పాల్గొన్నారు.