పెనుబల్లి, ఆగస్టు 3 : అబద్ధాలు, మోసపూరిత వాగ్దానాలతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని, ఇచ్చిన హామీలను విస్మరించి పూటకో మాట మాట్లాడుతోందని సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. ఈ నెల 5న పదవీ విరమణ చేయనున్న ఎంపీపీ, జడ్పీటీసీ, ఎంపీటీసీల సన్మాన కార్యక్రమం కల్లూరులోని ఓ ఫంక్షన్ హాల్లో శనివారం మండల పార్టీ ఆధ్వర్యంలో చేపట్టారు. పార్టీ మండల అధ్యక్షుడు పాలెపు రామారావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి సండ్ర ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.
ఇక నుంచి ప్రతిపక్ష స్థానంలో ఉండి.. ప్రజాక్షేత్రంలో ప్రజల పక్షాన పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీని ఎన్నికల మ్యానిఫెస్టోలో ఒకేసారి చేపడతామని చెప్పి.. ఇప్పుడు రూ.లక్ష, రూ.లక్షన్నర, రూ.2 లక్షలు ఇలా విడతలవారీగా చేపడుతూ సంబురాలు చేసుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. అలాగే పింఛన్ల పెంపు, రైతుభరోసా, జాబ్‌కార్డు వంటి పథకాలపై స్పష్టత లేదని, వీటన్నింటి గురించి ఇంటింటికి తిరిగి తెలియజేయాల్సిన అవసరం ఇకపై ఉందన్నారు.
అనంతరం ఎంపీపీ బీరల్లి రఘు, జడ్పీటీసీ కట్టా అజయ్‌బాబు, బీఆర్ఎస్ ఎంపీటీసీలను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో సత్తుపల్లి మున్సిపల్ చైర్మన్ కూసంపూడి మహేశ్, పెనుబల్లి మండల పార్టీ అధ్యక్షుడు కనగాల వెంకట్రావు, కార్యదర్శి భుక్యా ప్రసాద్, జడ్పీటీసీ చెక్కిలాల మోహన్‌రావు, లక్కినేని రఘు, మేకల కృష్ణ, కాటంనేని వెంకటేశ్వరరావు, సయ్యద్ అలీ, బోబోలు లక్ష్మణరావు, అంజయ్య, పెడకంటి రామకృష్ణ, సీహెచ్.కిరణ్, సయ్యద్ రావు, రామమల్ల నాగేశ్వరరావు, కంభంపాటి రమేశ్, షేక్ కమిలీ, బుర్రి భవానీ, కొరకొప్పుల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.