ఏటూరునాగారం, ఏప్రిల్ 25 : పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఓడిస్తేనే తెలంగాణకు భవిష్యత్ ఉంటుందని బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో గురువారం సాయంత్రం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రస్తుతం గందరగోళంలో ఉన్నదని, ఆగస్టు 15 నాటికి రాజకీయ సునామీ ఏర్పడుతుందన్నారు. అలవిగాని 420 హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేశారని, ప్రభుత్వంపై భారం లేని హామీలను అమలు చేస్తున్నారని, బస్సుల్లో ఉచిత ప్రయాణం, అరువు పెట్టే ఆరోగ్యశ్రీ, వంట గ్యాస్‌కు డబ్బులు ఇవ్వని పథకాలు అమలు చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
మీకు దమ్ముంటే మహిళలకు నెలకు రూ.2,500 ఇవ్వాలని, రూ.2 లక్షల రుణమాఫీపై ఇచ్చిన హామీ ఎప్పుడు నెరవేరుస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. ధాన్యం కొనుగోలుపై రూ.500 బోనస్ ఇవ్వడం లేదని, రైతుబంధు పెంచకపోగా.. ఉన్నదాన్ని చతికిలపడేలా చేశారని ధ్వజమెత్తారు. మేడిగడ్డ, శ్వేతపత్రం పేరుతో డ్రామాలు చేస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో 4 లక్షల మందికి పోడు పట్టాలు ఇచ్చి.. రైతుబంధు కూడా ఇచ్చిన ఘనత గత కేసీఆర్ ప్రభుత్వానిదేనన్నారు.
రాష్ట్రంలో కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి పనులు దేశానికే ఆదర్శంగా నిలిచాయన్నారు. కేసీఆర్ కుటుంబంపై వ్యక్తిగత కక్ష పెట్టుకుని టార్గెట్ చేస్తున్నారంటూ రేవంత్‌రెడ్డి తీరును దుయ్యబట్టారు. కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీలు ఎందుకు రావడం లేదంటూ ఆయన ప్రశ్నించారు. సమావేశంలో జడ్పీ చైర్పర్సన్ బడే నాగజ్యోతి, ఎంపీపీ అంతటి విజయ, పార్టీ మండల అధ్యక్షుడు గడదాసు సునీల్‌కుమార్, నాయకులు తుమ్మ మల్లారెడ్డి, కూనూరు మహేశ్, కుమ్మరి చంద్రబాబు, మాదిరి రామయ్య, బట్టు రమేశ్, కొండాయి చిన్ని, వావిలాల రాంబాబు, ఆలం సంతోశ్ తదితరులు పాల్గొన్నారు.